నల్లని కళ్ళు, దట్టమైన తల వెంట్రుకలు, సన్నని గొంతు, వయస్సుకంటే అధికంగా కనబడేటట్లు ఉంటారు. యదార్థవాదం, చాలా తెలివి తేటలు ఉన్నా ఇతరుల గురించి ఆలోచించకుండా తమకు తోచినట్లు వ్యవహిస్తారు. మొహమాటం లేకుండా అందరితో పనిచేయించుకునే తత్త్వం కలవారు. కొంత వ్యాపార ధోరణి కలవారు. ప్రతి విషయంలో తమకెంత లాభం ఉంటుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. స్వార్థం లేకుండా ఏ పని చేయలేరు. వీరికి సంగీతంపై మక్కువ ఉంటుంది. కొంత దురాశ ఉంటుంది.

చేసే అన్ని పనుల్లో జాగ్రత్త, మంచి చెడు ఆలోచించి తమకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారు. ఇతరుల తప్పులను గుర్తించడంలో సిద్ధహస్తులు. మంచి శాస్త్రపరిజ్ఞానం కలవారు. తమ అసలు ఆలోచనను ఎవరికీ బయట పెట్టరు. చాలా గుట్టుగా ఉంటారు.

అన్ని సమయాలు అనుకూలంగా ఉన్నప్పుడు వీరంత గొప్పవారు లేరు. తమకు ఏదైనా ఆటంకం కలిగి మనసు బాధపడుతూ ఉంటే ఏ పనిని చేయలేకుండా దిగాలుగా ఉంటారు. ఉదా : నేను విజయం సాధించలేకపోతున్నాను - పోటీలను తట్టుకోలేక పోతున్నాను -శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతున్నది - శత్రువులు పెరుగుతున్నారు - అందరూ నన్ను వ్యతరేకిస్తున్నారు - అప్పులు తీసుకున్నవారు ఇవ్వడం లేదు - నేను ఋణగ్రస్తుణ్ణి అవుతున్నాను - అనారోగ్య సమస్యలున్నాయి వంటివి షష్ఠభావ సంబంధమైన సాధారణ లోపాలు.

షష్ఠంలో అష్టకవర్గులో 24 కన్నా తక్కువ బిందువులుండడం, భిన్నాష్టక వర్గుల్లో గ్రహం ఇచ్చే బిందువులు 4 కన్నా తక్కువగా షష్ఠంలో ఉండడం, షష్ఠాధిపతి లగ్నాధిపతితో కూడి ఉండడం, షష్ఠంలో అష్టమ వ్యయాధిపతులుండడం, షష్ఠాధిపతి అష్టమ వ్యయాల్లో ఉండడం (విపరీత రాజయోగం), శుభగ్రహ సంబంధం షష్ఠానికి లేకపోవడం వల్ల నిరంతరం ఒత్తిడులు, శ్రమతో కూడుకున్న జీవనం ఏర్పడడం, అస్తిత్వానికోసం పోరాడడం వంటి షష్ఠభావ లోపాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఎదుటివారి ఎదుగుదలను వ్యతిరేకించడం, అసూయ పొందడం, ఏ విధంగానైనా వారిని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కాని వేదనకు గురి చేయడం, అప్పులు ఇతరులకు ఇచ్చి ఇబ్బంది పెట్టడం, ఇతరుల వద్ద తీసుకున్న ధనం సమయానికి ఇవ్వకుండా వేదనకు గురి చేయడం, ఎదుటి వారి సంపదకు ఓర్వలేకపోవడం, విజయం సాధించకుండా అడ్డుపడడం వంటి పూర్వకర్మలోపాల వల్ల ప్రస్తుతం ఇటువంటి లోపాలకు అవకాశం ఉంటుంది.

లోకంలో చాలామందికి ఆరోగ్య రక్షణకోసం సేవలను అందించాలి. సేవే పరమార్థంగా భావించాలి. తమకు తెలిసిన భావనలను మరికొందరికి పంచి వారి విజయానికి కారకులుగా నిలవాలి. శత్రువులను కూడా ప్రేమించే మనస్తత్వం అలవరచుకుని వారిలో మిత్రభావాన్ని చూడాలి. సాధ్యమైనంత వరకు పరిమితంగా బ్రతుకుతూ అప్పులకు దూరంగా మెలగాలి. అందరూ సంపదలు పొంది ఆనందంగా ఉంటుంటే మనస్ఫూర్తిగా సంతోషించడం, వారికోసం ప్రార్థించడం వంటి వాని వల్ల జ్యోతిర్వైద్య ప్రక్రియలో పూర్వకర్మ
దోషాలకు నివారణ ఉంటుంది.

శరీర శక్తి అపూర్వమైనదని, దాని లోపాలను అది పూడ్చుకునే శక్తి ఉన్నదని నిరంతరం భావించాలి. ప్రకృతి ఇచ్చే సంపదలు అపురూపమైనవని, ప్రకృతికి, శక్తికి, చైతన్యానికి ఎప్పటికీ ఋణపడి ఉండాలనే భావాన్ని పెంచుకోవాలి. తమకు వ్యతిరేకులు, వ్యతిరేకతలు ఏమీ లేవని, ఈ దివ్యచైతన్యంలో తాము తమ పాత్రను ఆనందంగా పోషిస్తున్నామనే ఆలోచనలను మార్చుకోవడం ద్వారా లోపనివారణలు ఉంటాయి.

ఎదుటివారు తక్కువ, తము తాము గొప్పవారనే ఆలోచననుంచి బయట పడి నమ్మకంతో దైవారాధన, దానం జపం చేయడం మంచిది.

డా. ప్రతిభ

ఇవి కూడా చదవండి..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?