సమానమైన దేహం కలవారు, పిత్త ప్రకృతి కలవాడు, ఎరుపు రంగు వర్ణం కలిగి ఉంటారు. అన్ని విధాల సుఖ సంతోషాలతో సుఖంగా ఉండడం, మనస్సులో తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలియజేయడం, మనో ధైర్యం కలిగి ఉంటారు. కష్టాలకు భయపడే తత్త్వం కాదు. చిన్న విషయాలకే కోపం రావడం సహజం. తమకు అప్పగించిన పనిని ఎంతటి కష్టమైనసరే పూర్తి చేస్తారు. చాలా గుంభనంగా ఉంటారు. అందరితో కలిసే తత్త్వం ఉండదు. ఎదుటివారు తమను గుర్తించాలనే భావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించే తత్త్వం ఉంటుంది. సమాజం కోసం ఎక్కువగా ప్రాకులాడుతారు.

ఆత్మవిశ్వాసం ఎక్కువ కావడం వల్ల తాను తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండాలని కోరుకుంటారు. తనలోని లోపాలను బైటికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఎవరైనా తనను చులకనగా చూస్తే అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చేసే పనిలో మంచి నేర్పు కలిగి ఉంటారు. అధికారం కోసం ఎక్కువ ప్రాకులాడుతారు. అందరూ తమ అధీనంలో ఉండాలని కోరుకుంటారు.

సింహం పంచమభావమై ఆ భావం బలహీనంగా ఉంటే పైన చెప్పిన లక్షణాలన్నీ తారు మారు అవుతాయి. ఏ చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేక ఆలోచనల్లో అలజడి ఎక్కువై ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదా : సంతానం కలగడం లేదు - సంతానం మాట వినడం లేదు - సంతాన సమస్యలు - ఆలోచనల్లో ఒత్తిడులు - మానసిక ఆందోళన అధికంగా ఉండడం - సృజనాత్మక శక్తి లేకపోవడం - ఉన్నత విద్యలోపాలు - ఏకాగ్రత లేకపోవడం - దైవ ఉపాసన కుదరక పోవడం వంటివి పంచమ భావ సంబంధమైన లోపాలు.

పంచమాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, పంచమంలో త్రిక స్థానాధిపతులున్నా, పంచమాధిపతి త్రిక స్థానాధిపతులతో కూడుకున్నా, పంచమాధిపతి నీచ, అస్తంగత, శత్రు క్షేత్రాలలో ఉన్నా, అష్టకవర్గులో పంచమంలో బిందువులు 24 కన్నా తక్కువగా ఉన్నా, భిన్నాష్టక వర్గులో పంచమంలో ఒక గ్రహం 4 కన్నా తక్కువ బిందువులను ఇచ్చినా పంచమభావ సంబంధమైన లోపాలు, వానికి సంబంధించిన ఆలోచనలు మనసును ప్రభావితం చేస్తాయి.

తెలిసో తెలియకనో ఇతరుల (ప్రాణులు, పశు పక్ష్యాదులు) సంతానాన్ని ఇబ్బంది పెట్టడం, మరొకరి గర్భశోకానికి తాము కారణం కావడం, ఇతరులను ఇబ్బంది పెట్టి వారు వేదన పడుతుంటే మనం సంతోషించడం, విద్యను దుర్వినియోగం చేయడం, మరొకరికి తమ విద్యా ఫలితాలను అందించలేకపోవడం, దైవాన్ని స్వార్థానికి వినియోగించుకోవడం వంటి పూర్వకర్మ లోపాలు ఈ రకమైనఇబ్బందులకు కారణాలవుతాయి.

"దానం కొద్ది బిడ్డలు" అనే సామెత ప్రకారం సంతానం గురించి ఎన్ని రకాల దానాలు చేస్తే అన్ని రకాల అభివృద్ధి, ఆనందం లభిస్తాయి. సంతానపరమైన సమస్యలు తొలగాలంటే దానాలు చేయడం ముఖ్యం. పిల్లలు తల్లితండ్రుల మాట వినడం లేదు అనే అంశాలకు గాని, సంతానం చిన్న వయస్సులో పొందే అనారోగ్యాలు, పెద్దవయస్సుల్లోనైనా పొందే కొన్ని సామాజిక సమస్యలకుపెద్దలకు పుణ్యం లేకపోవడమే కారణం. అందువల్ల వారు కూడా వేదనలకు గురి అవుతుంటారు. అందువల్ల ఆ లోపాలను అధిగమించడానికి దానం ఒక్కటే జ్యోతిర్వైద్య ప్రక్రియలో ముఖ్యమైన పరిష్కార మార్గం.

సృష్టి అంతా చక్కని సంతానశక్తిని పొంది ఉన్నది, పునరుత్పత్తి వల్లనే సృష్టి మనుగడ కొనసాగుతున్నది, తమ శరీరం కూడా పంచభూతాత్మకం కావడం వల్ల అటువంటి లక్షణాలన్నీ తమకూ పరిపూర్ణంగా ఉన్నాయి. విశ్లేషణాత్మక శక్తి, ఏకాగ్ర సాధన, అధ్యయనం అన్నీ ఈ సృష్టిలోని భాగాలే. వాటన్నింటితో కూడుకున్న నూతన జ్ఞాన శక్తి తనకు ఈ ప్రకృతి ప్రసాదిస్తుంది అనే భావనలు ఏర్పరచుకోవడం ద్వారా లోపనివారణలుంటాయి.

తన చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ తనన్న ఉన్నతమైనదిగా ఉండేటట్లుగా చూసుకుంటూ తాను ఏ స్థితికి వెళ్ళాలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

డా. ప్రతిభ

ఇవి కూడా చదవండి..

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?