విజయవాడ: విజయవాడ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ చేసి వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పొట్లూరి సీఐఐఏ సదస్సులో ప్రస్తావించడం పెద్ద రాద్ధాంతానికి దారి తీస్తున్నాయి. 

హోదా బోరింగ్ సబ్జెక్టు అంటారా ఆయనకి రాష్ట్ర ప్రజల మనోభవాలు అక్కర్లేదా అంటూ టీడీపీ ఘాటుగా విమర్శిస్తోంది. ప్రత్యేక హోదా గురించి హేళనగా మాట్లాడిన పీవీపీ రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం అంటూ తిట్టిపోస్తున్నారు. 

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పీవీపీ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ ప్రజల మనోభవాలను అర్థం చేసుకోలేని నువ్వు విజయవాడలో ఏమి ఉద్దరిస్తావని ప్రశ్నించారు. 

పీవీపీ అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేసిన వ్యక్తి అని ఆరోపించారు. సెబీ కేసుల్లో ఇరుక్కుని దాక్కుంటున్న వ్యక్తి అంటూ ఆరోపించారు. జగన్ డబ్బును హవాలా చేసింది కూడా ఆయనేనంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ నైజం, పీవీపీ నైజం ఒక్కటేనని ఆరోపించారు. 

మరోవైపు టీడీపీ చేస్తున్న రాద్ధాంతంపై వైసీపీ కూడా స్పందించింది. తమ నేత పీవీపీ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తోంది. ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలనే దుర్భుద్ధితో ఇలాంటి నీచానికి పాల్పడిందంటూ మండిపడుతున్నారు. 

తమ నేత మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా పెట్టకుండా ఆ వ్యాఖ్యలను మాత్రమే ఎడిటింగ్ చేసి పెట్టడం అనేది కుట్రలో భాగమేనన్నారు. సదస్సులో 8 పార్టీల ప్రతినిధులు పాల్గొన్న సమయంలో పీవీపీ అలా హేళనగా మాట్లాడితే మిగిలిన వారు ఎందుకు ప్రశ్నించరని చెప్తున్నారు. 

పీవీపీ ప్రసంగిస్తున్నప్పుడు కూడా టీడీపీ ప్రతినిధి ఉన్నారని అయినా అప్పుడు స్పందించకుండా ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వచ్చిందని స్పందించడం కుట్ర కాదా అంటూ విరుచుకుపడుతోంది. 

ఇకపోతే బుధవారం విజయవాడలో జరిగిన సీఐఐఏ సమావేశంలో పొట్లూరి వరప్రసాద్ ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అని దానిపై చర్చ అప్రస్తుతం అంటూ చెప్పుకొచ్చారు. సీఐఐఏ నిర్వహించిన సదస్సు అనేది నాన్ పొలిటికల్ సదస్సు అని దానిలో తాను మాట్లాడింది వేరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది వేరు అంటూ వ్యాఖ్యానించారు. 

ఈ సదస్సుకు తనతోపాటు 8 రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారని అయితే ఆ సమావేశంలో ఇండస్ట్రీ పాలసీపై తాను చర్చిస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా కోసం ఇంకా మాట్లాడి బోర్ కొట్టించదలచుకోలేదని ప్రత్యేక హోదా కోసం ప్రజలకు ఎంత ఉపయోగమో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. 

సీఐఐఏ సదస్సులో తాను ఆఖరిగా మాట్లాడటం జరిగిందని అప్పటికే ప్రత్యేక హోదా కోసం చాలామంది మాట్లాడారని ఇకపై దాని గురించి మాట్లాడి  బోర్ కొట్టించదలచుకోలేదని తమ నాయకుడి విజన్ గురించి ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చానని అయితే దానిని ఎడిటింగ్ చేసి రాద్ధాంతం చేస్తున్నారని వాపోయారు. 

దానిపై తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఐదు నిమిషాలు మాట్లాడితే కేవలం 15 సెకన్లు మాత్రమే కట్ చేసి పెట్టడం అనేది రాజకీయ కుట్రమాత్రమేనంటున్నారు. ఇలా టీడీపీ సోషల్ మీడియాలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి రాజకీయాలను పక్కదోవ పట్టించుకునేందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మెుదటి నుంచి పోరాడుతోంది తమ పార్టీయేనని, పోరాడుతున్న నేత వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు పొట్లూరి వరప్రసాద్.  
 

ఈ వార్తలు కూడా చదవండి

హోదా బోరింగ్ సబ్జెక్ట్ అన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి పీవీపీ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

3లక్షల మెజారిటీతో గెలుస్తా, వైసీపీ పోటీలోనే ఉండదు: ఎంపీ కేశినేని నాని