విజయవాడ : విజయవాడ వైసీపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ సరికొత్త వివాదంలో ఇరుకున్నారు. ప్రత్యేక హోదా బోరింగ్‌ సబ్జెక్ట్‌ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

ఏపీ రాజకీయాల్లో పీవీపీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బుధవారం విజయవాడలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ అభ్యర్థి పీవీపీ పాల్గొన్నారు. 

పీవీపీతోపాటు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్‌ సబ్జెక్ట్‌ అని, దానిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీవీపీ వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీవీపీ ఇంటర్నేషనల్ స్కామస్టర్ అంటూ ఆరోపించారు. సెబీ కేసుల్లో నిందితుడు పీవీపీ అంటూ ఆరోపించారు. 

అంతర్జాతీయ స్కామ్ లో పీవీపీ పేరుమార్మోగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అన్న పీవీపీ వ్యాఖ్యలపై ప్రజలే తగిన సమాధానం చెప్తారంటూ కేశినేని నాని స్పష్టం చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే వక్రీకరించారని పీవీపీ ఆరోపించారు. 

తాను ఏదో చివర అన్న మాటలు కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని దాన్ని పూర్తిగా అప్ లోడ్ చేస్తే తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో తెలుస్తోందని చెప్పుకొచ్చారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలా కుట్రలకు టీడీపీ తెరలేపిందని పీవీపీ స్పష్టం చేశారు.