ఆమెకు ఇరవైఆరేళ్ల వయసు. అందులోనూ మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అయితేనేం పార్టీకోసం కష్టపడి పనిచేసింది. అందుకు దక్కిన ఫలితమే అతి చిన్నవయసులో ఎంపీగా పోటీచేసే అవకాశం రావడం. కేవలం పోటీ చేయడమే కాదు రాజకీయ ఉద్దండుడయిన ప్రత్యర్థిని ఓడించిన అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ఇలా 26 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెడుతున్న ఆమె మరెవరో కాదు మన తెలుగింటి ఆడపడుచు...వైసిపి తరపున అరకు లోక్ సభ స్థానం నుండి గెలుపొందిన గొడ్డేటి మాధవి. 

ఇలా 26ఏళ్ల వయసులో ఎంపీగా గెలుపొందిన మాధవి ఖాతాలో  ఓ అరుదైన ఘనత చేరింది. ఇప్పటివరకు అతిచిన్న వయసులో (28  ఏళ్లు) పార్లమెంట్ లో అడుగుపెట్టిన ఘనత  ఇప్పటివరకు హర్యానా ఎంపీ దుష్యంత్ చౌహాన్ పేరిట వుంది. అయితే అతడికంటే తక్కువ వయసులోనే మాధవి ఎంపీగా గెలిచి దుష్యంత్ రికార్డును బద్దలుగొట్టింది. ఇలా ఆమె అతి చిన్న వయసులో పార్లమెంట్ కు ఎన్నికైన ఎంపీగా, మరీ ముఖ్యంగా మహిళా ఎంపీగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో అరకు లోక్ సభ స్థానం  వైసిపి అభ్యర్థిగా గొడ్డేటి మాధవి పోటీ చేయగా...టిడిపి నుండి మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ బరిలో నిలిచారు. అయితే  రాజవంశీకుడు, స్థానికంగా బాగా పలుకుబడి వున్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, రాజకీయ ఉద్దండుడిగా అతడికి పేరున్నా మాధవి మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అతన్ని దీటుగా ఎదుర్కొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అదే ఆమెను ఇలాంటి సీనియర్ నాయకుడిని ఓడించి 26 ఏళ్లకే  పార్లమెంట్ మెట్లెక్కేలా చేసింది. 
 
అయితే మాధవి ఏదో బోటాబోటి ఓట్లతో గెలిచిందనుకుంంటే పొరబడినట్లే. వైఎస్సార్‌సిపి నుండి గెలిచిన అందరు ఎంపీల  కంటే ఆమె మెజారిటీయే ఎక్కువ కావడం  విశేషం.  ఆమెకు ఏకంగా రెండు లక్షల ఇరవైవేల పైచిలుకు మెజారిటీ లభించింది. అరకు ప్రజలు తనపై చూపించిన ప్రేమే ఓట్ల రూపంలో తనను గెలిపించిందని ఎంపీ మాధవి అన్నారు. అతి చిన్న వయసులో పార్లమెంట్ లో అడుగుపెట్టే రోజుకోసం ఎదురు చూస్తున్నట్లు మాధవి తెలిపారు.