యోగా డే సందర్భంగా విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Yogandhra 2025 : అంతర్జాతీయ యోగా డే 2025 సందర్భంగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 21 వరల్డ్ బుక్ రికార్డ్స్, 2 గిన్నిస్ రికార్డ్స్ కలిపి మొత్తంగా 23 అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పిందని అన్నారు. విద్యాశాఖ గిరిజన విద్యార్థుల చేపట్టిన సూర్యనమస్కారాలకు కూడా గిన్నిస్ రికార్డు లభించిందని చంద్రబాబు తెలిపారు.
విశాఖపట్నంలో నిర్వహించిన ఈ యోగా డే వేడుకలకు గుర్తుగా ఓ డిక్లరేషన్ తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే యోగ ధ్యాన్ పరిషత్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ కృషి ఫలించిందని.. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ భాగస్వామ్యం మరిచిపోలేనిదని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కోట్లమంది యోగా వేడుకల్లో పాల్గొన్నారని చంద్రబాబు తెలిపారు.
విశాఖపట్నంలో హుద్ హుద్ సమయంలో తాను ఎంతలా కష్టపడింది చంద్రబాబు వివరించారు. హుద్ హుద్ సమయంలో తాను ఇక్కడే (కలెక్టరేట్లో) ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో వాతావరణం సహకరించకపోయినా ఇక్కడికి వచ్చానని... హైదరాబాద్ నుండి విశాఖకు చేరుకునేందుకు నానా పాట్లు పడ్డానని తెలిపారు.
హైదరాబాద్ నుండి నేరుగా విశాఖకు రాలేక విజయవాడకు విమానంలో... అక్కడి నుండి రోడ్డు మార్గంలో విశాఖపట్నం బయలుదేరానని తెలిపారు. మధ్యలో రాజమండ్రిలో చెట్లు కూలితే రాత్రి అక్కడే ఉన్నాను... తర్వాత హెలికాప్టర్ లో విశాఖకు వచ్చానని తెలిపారు. 11 రోజులు ఇక్కడే ఉన్నానని... హెలికాప్టర్ లో భోజనాలు తెప్పించానని చంద్రబాబు గుర్తుచేసారు.
ఆనాటి పరిస్థితుల కారణంగా దీపావళి రోజు టపాకాయలు కాల్చవద్దని విశాఖ వాసులను కోరారు.. తాను చెప్పినట్లే చేసారన్నారు. అయితే తాజాగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరానని... దీంతో నిన్న అర్ధరాత్రి నుంచే తరలివచ్చారని అన్నారు... ముసలివాళ్లు సైతం ఆసనాలు వేశారన్నారు. ఆరోజు వద్దంటే విన్నారు.... ఈరోజు రమ్మంటే వచ్చారని చంద్రబాబు విశాఖ ప్రజలను కొనియాడారు.
ఇక యోగా విషయానికి వస్తే... 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు సూరత్ లో లక్ష మంది ఒకేసారి యోగాసనాలు వేయడమే గిన్నిస్ రికార్డు.. ఇవాళ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొని యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు బద్దలుగొట్టామని అన్నారు. ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ముందుకు తీసుకెళతామన్నారు. ట్రైబల్ స్టూడెంట్స్ యోగాసనాలు కూడా మరో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాయని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా డే వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. లక్ష మందికి పైగా యోగా ట్రైనర్స్ ను తయారుచేశామని... వారికి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చామన్నారు. కేంద్రం ఈ యోగా డే కోసం 5 లక్షల టీషర్టులు, 5 లక్షల మ్యాట్స్ పంపించిందన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని 30 రోజులు ప్రమోట్ చేసామని.. ఇందుకు సహకరించిన మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.
11వ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ ను తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్ లో ఈ యోగా వల్ల కలిగే లాభాలను ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తామన్నారు. వైద్యారోగ్య రంగంలో ఈ యోగా గేమ్ చేంజర్ కానుందని అన్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం 18 వేల కోట్లను హెల్త్ కోసం ఖర్చు చేస్తోందని.. యోగా ద్వారా ఈ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఫార్మసి, ఆపరేషన్ల వల్ల ఎన్నో ప్రమాదాలున్నాయని... కాలు విరిగితే అది విరిగిన కాలే ఎప్పటికీ సాధారణం కాలేదన్నారు. కాబట్టి ఇలా శరీరం డ్యామేజ్ కాకుండా ఉండాలంటే యోగా సరైన మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు.


