అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విషయంలో చంద్రబాబునాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.కోడెలపై చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుబడుతోంది. ఈ విషయమై చంద్రబాబు నిర్ణయం కోసం సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలోని సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి  2014, 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు. 2019లో మాత్రం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యాడు.

2019లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైంది. దీంతో కోడెల శివప్రసాదరావుకు కష్టాలు మొదలయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో కోడెల వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది.

కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై వరుసగా కేసులు పెట్టారు. కోడెల తనయుడు, కూతురు భారీగా డబ్బులు వసూలు చేశారని వాటిని ఇప్పించాలని కోరుతూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల నుండే ఈ కేసులు ప్రారంభమయ్యాయి. వరుసగా ఫిర్యాదులు కొనసాగాయి. 

మరో వైపు ఈ కేసుల్లో ఎక్కువగా టీడీపీకి చెందిన వారు పెట్టినవే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కోడెల శివప్రసాదరావును సత్తెనపల్లి నియోజకవర్గం నుండి  తప్పించాలని ఆయన వ్యతిరేక వర్గం కోరుతోంది. 

ఇటీవల సత్తెనపల్లికి చెందిన టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. కోడెలను సత్తెనపల్లి నుండి తప్పించాలని కోరారు. అయితే ఈ విషయంలో చంద్రబాబునాయుడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

కోడెలపై చర్యలు తీసుకొంటే  కోడెల శివప్రసాదరావు తప్పు చేసినట్టుగా ఒప్పుకొన్నట్టేననే వాదించే వాళ్లు కూడ లేకపోలేదు. పార్టీని ప్రక్షాళన చేయాలంటే కొన్ని సమయాల్లో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడ కొందరు పార్టీ నేతలు కోరుతున్నారు. 

కోడెలపై చర్యలు తీసుకొంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహలో మరికొందరి నేతలపై అసంతృప్తులు కూడ చర్యలకు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో వేచి చూసే ధోరణితో వ్యవహరించడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అర్ధరాత్రి సోదాలు, నాకు రూల్స్ చెబుతున్నారు: ఇది కక్ష సాధింపేనన్న కోడెల

రగులుతున్న అంతర్గత తగాదా: కోడెలకు చుక్కెదురు, రాయపాటి మకాం

కోడెలపై తిరుగుబాటు, మాకొద్దంటూ అధినేతకు ఫిర్యాదు: సముదాయించిన చంద్రబాబు