గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు దిగారు. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

కోడెల శివప్రసాదరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచింది ఎలా ఉన్నా ఆ కుటుంబ పెత్తనం మాత్రం తాము సహించలేకపోతున్నామని అసమ్మతి వర్గం ఆరోపించింది. ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తమ వాదనలు వినిపించారు. 

గుంటూరులోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు ను కలిసిన అసమ్మతి వర్గం కోడెల వద్దు చంద్రబాబు ముద్దు అంటూ నినాదాలు చేశారు. కోడెల శివప్రసాదరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

కోడెల శివప్రసాదరావు వల్ల సత్తెనపల్లి నియోజకవర్గం పదేళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు వద్ద ఆరోపించారు. కే ట్యాక్స్ పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వేదించారంటూ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల నాయకత్వంతో తాము పని చేయలేమని చంద్రబాబుకు తేల్చి చెప్పారు.  

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ స్పీకర్‌ కోడెల శిప్రసాదరావుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వొద్దంటూ ఆ పార్టీ నాయకులు నిరసనలు ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలు నిరసనలకు దిగినప్పటికీ చంద్రబాబు వారిని బుజ్జగించారు. కోడెలకు టికెట్ ఇచ్చారు.  

అయితే ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు కోడెల శివప్రసాదరావు. టీడీపీ ఘోర పరాజయానికి కోడెల కుటుంబమే కారణమని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు.  

నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోడెల శివప్రసాదరావు కొనసాగితే పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశముందని చంద్రబాబు వద్ద తేల్చి చెప్పారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరారు. 

ఇకపోతే అంతకుముందు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం ఎవరితో మాట్లాడకుండా కోడెల శివప్రసాదరావు వెళ్లిపోయారు.  

అనంతరం కోడెలకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సైతం చంద్రబాబు నాయుడిని కలిసి తమ వాదనలు వినిపించారు. డోంట్ వర్రీ అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని తాను ఉన్నానంటూ భరోసా ఇవ్వడంతో వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు.