Asianet News TeluguAsianet News Telugu

రగులుతున్న అంతర్గత తగాదా: కోడెలకు చుక్కెదురు, రాయపాటి మకాం

రాయపాటి రంగబాబు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తారని తెలుసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో కోడెల తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేక వేరే నియోజకవర్గానికి షిప్ట్ అవుతారా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 

kodela sivaprasadarao facing internal problems in the party, rayapati rangababu enter sattenapalli
Author
Guntur, First Published Aug 8, 2019, 3:39 PM IST

గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కథ క్లైమాక్స్ కి చేరినట్లేనా...?ఇప్పటి వరకు ఉన్న కోడెల అడ్డా ఇకపై రాయపాటి రంగబాబు వశం కానుందా....? రాయపాటి రంగబాబు సత్తెనపల్లిలో మకాం వేస్తే మరి కోడెల ఊరుకుంటారా....? ఇవే ప్రశ్నలు సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజల మదిని తొలిచివేస్తున్నాయి. 

తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఊహించనిస్థాయిలో అసమ్మతి సెగ తగిలింది. 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావుకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబు నాయుడు వద్ద మెురపెట్టుకున్నారు సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు. 

అయితే సీనియర్ రాజకీయ వేత, అందులోనూ టీడీపీ ప్రారంభం నుంచి పార్టీలో ఉండటంతో కోడెల శివప్రసాదరావును తప్పించే సాహసం చేయలేకపోయారు చంద్రబాబు. అదే సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించిన మాజీఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబును మాత్రం బుజ్జగించి వెనక్కుతగ్గించారు. 

మెుత్తానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో కోడెల శివప్రసాద్ ఓటమిపాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కోడెల సీన్ కాస్త రివర్స్ అయిపోయింది. 

కోడెల స్పీకర్ గా పనిచేసినప్పుడు ఆయన తనయుడు కోడెల వెంకట శివరాం, కుమార్తె విజయలక్ష్మీలు కే ట్యాక్స్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారంటూ నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. ప్రచారం జరగడమే కాదు ఏకంగా కోడెల కుటుంబంపై కేసులు కూడా నమోదయ్యాయి. 

కోడెల తనయుడు వెంకటశివరాంపై ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 10కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు కోడెల కుమార్తెను సైతం వదల్లేదు. ఆమెపై కూడా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల నుంచి తనను తప్పించాలని హైకోర్టుకు వెళ్లినా పాపం విజయలక్ష్మికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. 

కే ట్యాక్స్ వసూళ్లు చేశారంటూ ఆరోపించిన వారిలో వైసీపీ నేతలు, సామాన్యులు, కాంట్రాక్టర్లు సైతం ఉన్నారు. ఇంకోగమ్మత్తైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం కోడెల శివరాంపై ఫిర్యాదు చేయడం గమనార్హం. 

కోడెల వారసులు కే ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని ఫలితంగా నియోజకవర్గంలో టీడీపీకి భారీగా నష్టం వాటిల్లుతుందంటూ అసమ్మతి వర్గం చంద్రబాబు వద్ద  పంచాయితీ పెట్టింది. అయితే డోంట్ వర్రీ తాను ఉన్నానంటూ వారిని సముదాయించి పంపించి వేశారు చంద్రబాబు. 

అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, తన కుటుంబంపై వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇచ్చి సైలెంట్ గా వెళ్లిపోయారు. ఆసమయంలో కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ అసమ్మతి వర్గం ప్లకార్డులు సైతం ప్రదర్శించింది.

అటు కోడెల వివరణ మరోవైపు కోడెల అసమ్మతి వర్గం వాదనలు విన్న చంద్రబాబు ఇద్దర్నీ సముదాయించి పంపించి వేశారే తప్ప ఎలాంటి స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ఈ ఘటన జరిగి 24గంటలు కాకముందే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు రంగంలోకి దిగారు. 

సత్తెనపల్లి నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. కోడెల అసమ్మతి వర్గంతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో సమస్యలపై చర్చించారు. అంతేకాదు అసమ్మతి వర్గంతో కలిసి వెళ్లి నిరాహార దీక్షలు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతు సైతం తెలిపారు. 

రాయపాటి రంగబాబు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తారని తెలుసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో కోడెల తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేక వేరే నియోజకవర్గానికి షిప్ట్ అవుతారా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఇకపోతే 2019 ఎన్నికల్లో రాయపాటి రంగబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావించారు. అటు రాయపాటి సాంబశివరావు సైతం తన కుమారుడుకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే చంద్రబాబు బుజ్జగింపులతో రంగబాబు వెనుదిరగాల్సి వచ్చింది. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెలపై తిరుగుబాటు, మాకొద్దంటూ అధినేతకు ఫిర్యాదు: సముదాయించిన చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios