వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. స్ధానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో కొందరు తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. ఆ బాధితుల్లో తాను ఒకడినని కోడెల వాపోయారు. ఇన్ని కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే.. పోలీసుల వద్ద సమాధానం లేదన్నారు.

సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో శాఖల్లో మంత్రి పదవులు నిర్వహించని తనకు పోలీసులు నిబంధనలు చెప్పడం విడ్డూరంగా ఉందని కోడెల ధ్వజమెత్తారు.

గుంటూరులో తన కుమారుడు శివరాం నిర్వహిస్తున్న హీరో షోరూంను రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేశారని.. అర్ధరాత్రి పూట తనిఖీలు నిర్వహించడం, వరుస సెలవు దినాల్లో సీజ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కోడెల ఆరోపించారు.

ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా షోరూంను సీజ్ చేస్తే అక్కడ పనిచేస్తున్న దాదాపు 200 మంది కార్మికుల పరిస్ధితి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.

శివప్రసాద్ కుమారుడు, కుమార్తె భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడటంతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లిలో కే ట్యాక్స్ పేరిట వసూళ్లకు పాల్పడ్డారని పలువురు పోలీస్ స్టేషన్‌లలో కేసు పెట్టారు.

తాజాగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు అమ్మిన అభియోగంపై ఆర్టీఏ అధికారులు శనివారం గుంటూరు నగరంలో కోడెల కుటుంబానికి చెందిన హీరో షోరూంను సీజ్ చేశారు.