సారాంశం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి (అక్టోబర్ 9)కి వాయిదా పడింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ క్రమంలోనే చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిదార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసులో పీసీ యాక్ట్ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా? అనే దానిపై ప్రధానంగా వాదనలు జరిగాయి. అయితే ఇరువర్గాల తరఫున హోరాహోరీగా వాదనలు జరగగా.. తదుపరి విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సోమవారానికి (అక్టోబర్ 9) వాయిదా వేసింది. హైకోర్టులో దాఖలు చేసిన మొత్తం పత్రాలను సమర్పించాలని న్యాయవాది ముకుల్ రోహత్గీని కోరింది.
అసలేం జరిగిందంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును చంద్రబాబు సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నెంబర్ 63గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ను ప్రస్తావించారు. పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏ వివరణను చూడాలని కోరారు. సెక్షన్ 17ఏపై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైకోర్టులో తీర్పులో 17ఏను తప్పుగా అన్వయించారని అన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందని.. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు అధికార విధుల్లో భాగంగా ఇచ్చినట్టుగా పేర్కొన్నారని చెప్పారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని అన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరిత చర్య అని హరీష్ సాల్వే వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని చెప్పారు.
‘‘2021 డిసెంబర్ 9న కొంత విచారణ ప్రారంభైమంది. ఇది 2021 సెప్టెంబర్ 7న డీజీపీకి రాసిన లేఖ ఆధారంగా రూపొందించబడింది. ఎఫ్‌ఐఆర్ ఎప్పుడూ నమోదైతే అప్పటినుంచే 17ఏ వర్తిస్తుంది. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యం కాదు. ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం. 2018 జూలై ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదన్న వాదనల్లో అర్థం లేదు. సెక్షన్ 17ఏ విచారణ తేదీ గురించే తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది’’ అని హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా ఈ విచారణ జరగవచ్చా? అని అన్నారు.
ఇక, చంద్రబాబు తరఫున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా కేసులో తీర్పును ప్రస్తావించారు. ఈ క్రమంలోనే హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ.. యశ్వంత్ సిన్హా విషయంలో జస్టిస్ జోసెఫ్ ఏకీభవించిన తీర్పు వర్తిస్తుందని అన్నారు.
ఈ క్రమంలోనే జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ.. ఎంత మంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరవుతున్న ముకుల్ రోహత్గీతో తాము నలుగురం సరిపోలలేమని సాల్వే వ్యాఖ్యానించారు.
అవినీతి నిరోధక చట్ట సవరణలోని ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్దారించారు. కేబినెట్ నిర్ణయాలకు సీఎం ఒక్కే బాధ్యులు కాలేరు. కేబినెట్ నిర్ణయాలంటే అధికార నిర్వహణలో భాగమే. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు 17ఏ ప్రతీకార చర్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించి తీరుతుంది. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుంది. 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయి’’ అని అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ.. ఎఫ్‌ఐఆర్ తర్వాత ఎఫ్‌ఐఆర్ ఉందని.. ఇది రాజకీయ కక్షకు సంబంధించిన స్పష్టమైన కేసు.. 73 ఏళ్ల వ్యక్తిని విచారిస్తున్నారు.. మరో 2 ఎఫ్‌ఐఆర్‌లు కూడా వరసగా ఉన్నాయని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సెక్షన్ 17ఏ ప్రశ్న తలెత్తదని అన్నారు. 2018 జూలైలో చట్టసవరణ వచ్చిందని.. 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెప్పారు. 2017లోనే కేసు మూలాలు ఉన్నందున 17ఏ వర్తించదని వాదించారు. ప్రస్తుత ప్రభుత్వం రాకముందే ఈ కేసు విచారణ ప్రారంభమైందని చెప్పారు.
ఈ క్రమంలోనే జస్టిస్ బోస్.. ముందే విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. 10 శాతం ప్రభుత్వ సంస్థ, 90 శాతం ప్రైవేట్ సంస్థ పేరుతో వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని లాయర్ రోహత్గీ అన్నారు. ఈ క్రమంలోనే జస్టిస్ బోస్ స్పందిస్తూ.. కేసు మెరిట్స్‌పై చర్చ జరగడం లేదని.. కేసు వివరాల్లోకి వెళ్లొద్దని సూచించారు. లాయర్ రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. కేసు వివరాలు లేకుండానే హైకోర్టు పిటిషన్‌ను నిరాకరించిందని చెప్పారు. ఈ కేసులో పిటిషనర్ కౌంటర్ కూడా వేయలేదని అన్నారు. హైకోర్టుకు అన్ని పత్రాలు సమర్పించామని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ పత్రాలను సమర్పించాలని రోహత్గీని ఆదేశిస్తూ.. విచారణను ధర్మాసనం అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అయితే చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారని.. త్వరగా విచారణకు అభ్యర్థించారు.
ఈ క్రమంలోనే ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. వారు బెయిల్ కోసం ఒత్తిడి చేయడం లేదని, క్వాష్ పిటిషన్‌ను వాదిస్తున్నారని అన్నారు. అయితే చివరకు ఈ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్టుగా ధర్మాసనం పేర్కొంది.