Srikakulam Stampede : కార్తీక మాస వేడుకలు విషాదంగా మారాయి. శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలామంది గాయపడ్డారు.
Srikakulam Stampede : ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక మాస వేడుకలు విషాదంగా మారాయి. ఇవాళ (నవంబర్ 1, శనివారం) శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగి ప్రమాదానికి దారితీసింది. భక్తుల మధ్య తోపులాట జరిగి ఒక్కసారిగా తొక్కిసలాట మొదలయ్యింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి గాయపడిన భక్తులను హాస్పిటల్ కు తరలించారు.
అసలేం జరిగింది?
కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి పవిత్రంగా భావిస్తుంటారు.. అందులోనూ ఈసారి శనివారం రావడంతో శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ స్థాయి భక్తులు వస్తారని ఆలయ సిబ్బంది ఊహించలేదు… అందుకే ముందుగా తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తమకు తోచిన మార్గాల్లో లోపలికి వెళ్ళడం ప్రారంభించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తోంది.
ఆలయంలోంచి బయటకు వచ్చే మార్గంలోంచి భక్తులు లోపలికి వెళ్లడంవల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేవారు.. దర్శనం కోసం లోపలికి వెళ్ళేవారు ఎదురెదురుగా రావడంతో తోపులాట మొదలయ్యింది… ఇదికాస్త తొక్కిసలాటగా మారినట్లు తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి :
శ్రీకాకుళం ఆలయంలో చోటుచేసుకున్న దుర్ఘటన గురించి తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. ఇది తనను ఎంతో కలచివేసిందని అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. అలాగే గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు సూచించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే ఆలయంవద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
మంత్రి నారా లోకేష్ రియాక్ట్ :
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మంత్రి నారా లోకేష్. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొందని... మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను... బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించానని నారా లోకేష్ తెలిపారు.
