- Home
- Andhra Pradesh
- Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
Telugu Woman Inspiring Journey : పేదరికాన్ని ఎదిరించి, కట్టుబాట్లను తెంచుకుని ఓ ముస్లిం యువతి పోలీస్ ఉద్యోగాన్ని సాధించింది. ఐదు రూపాయల భోజనం నుండి అనుకున్నది సాధించేవరకు ఆమె జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం.

ఓ తెలుగమ్మాయి సక్సెస్ స్టోరీ..
Success Story : పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు... ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో తెలుగమ్మాయి. పేదరికాన్ని ఎదిరించింది... కట్టుబాట్లను తెంచుకుంది... అవమానాలను దిగమింగింది... ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్నవారితోనే ఏం సక్సెస్ రా..! అనిపించుకుంది. ఇలా అన్న క్యాంటిన్ నుండి పోలీస్ జాబ్ వరకు ఓ అమ్మాయి సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం. ఈ సక్సెస్ స్టోరీ నేటి యువతరానికి పాఠంగా పనికొస్తుంది... సక్సెస్ సాధించిన ఈమె నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది.
షేక్ హఫిజున్ వ్యక్తిగత జీవితం
వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు గ్రామానికి చెందిన షేక్ గన్లూర్ హఫిజున్ ది నిరుపేద కుటుంబం. ఆమె చిన్నప్పటినుండి కష్టాలను చూస్తూనే కాదుకాదు అనుభవిస్తూనే పెరిగింది. అయితే తమ కుటుంబాన్ని మార్చేది చదువు ఒక్కటేనని ఆమె తల్లిదండ్రులు భావించారు. అందుకే ఆర్థిక కష్టాలు, కట్టుబాట్లను ఎదిరించి కూతురిని చదివించారు... తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా హఫిజున్ కూడా బాగా చదువుకుంది.
తల్లిదండ్రులు కూలీనాలి చేయడం చూస్తూ పెరిగిన హఫిజున్ ఏనాడూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు గర్వపడేలా డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. కానీ ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో పరిస్థితులు కఠినంగా మారాయి. పెళ్లీడు రావడంతో హఫిజున్ కు వివాహం చేశారు తల్లిదండ్రులు.
పెళ్లి తర్వాత ఇక తన గవర్నమెంట్ జాబ్ ఆశలు అడియాశే అనుకుంది హఫిజున్. కానీ ఆమె నిర్ణయాన్ని గౌరవించే భర్త దొరికాడు. దీంతో హఫిజున్ తన ఉద్యోగ ప్రయత్నాన్ని కొనసాగించింది... చివరకు అనుకున్నది సాధించింది. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సాధించి పుట్టింటివారు, అత్తింటివారు గర్వపడేలా చేసింది.
అన్న క్యాంటిన్ నుండి పోలీస్ జాబ్ వరకు.. హఫిజున్ సక్సెస్ జర్నీ
హఫిజున్ పోలీస్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. కరోనాతో కన్న తల్లి మరణించింది... కట్టుకున్న భర్త అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో ల్యాబ్ టెక్నిషన్ గా ఉద్యోగం చేస్తూ పుట్టింటిని, అత్తవారింటిని పోషించింది. కొడుకును చదివించుకుంది. ఇలా ఓవైపు కుంటుంబం, మరో వైపు తన ఆశయం రెండింటిని బ్యాలన్స్ చేసింది హఫిజున్.
పేదరికం, ఆర్థిక కష్టాలు వెనక్కి లాగుతున్నా హఫిజున్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో జీవితంలో సవాళ్లను ఎందుర్కొంది. ఆమె ఆకలిబాధను అన్న క్యాంటిన్ తీర్చింది... భర్త, బిడ్డతో కలిసి చాలాసార్లు అన్నక్యాంటిన్లో తిన్నానని స్వయంగా హఫిజున్ తెలిపారు. ఇలా తన సక్సెస్ లో అన్న క్యాంటిన్ పాత్ర కూడా ఉందని ఆమె గర్వంగా చెప్పకున్నారు.
ఇలా ఎంతో కష్టపడి పోలీస్ ప్రిపరేషన్ కొనసాగించింది హఫిజున్. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ను ఎంతో కష్టపడి పూర్తి చేసింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది షేక్ గన్లూర్ హఫిజున్.
ప్రభుత్వం ఇచ్చే ఒక ఉద్యోగం ఎంత మందికి ఆసరా ఇస్తుందో చెప్పడానికి ఈ యువతి జీవితమే ఒక నిదర్శనం. హఫీజున్ అనే ఈ యువతి భర్తకు అనారోగ్యం. తన కుటుంబాన్నే కాదు, తన కన్నవారి కుటుంబాన్ని కూడా తానే పోషించాల్సిన పరిస్థితి ఆమెది. అన్న క్యాంటీన్ కు వెళ్లి ఆకలి చల్లార్చుకునేవారు. అలాంటి… pic.twitter.com/I3iAusn9R3
— Telugu Desam Party (@JaiTDP) December 20, 2025
చంద్రబాబు చేత ప్రశంసలు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలచేయగా 6,017 మంది ఎంపికయ్యారు. వీరిలో 5757 మంది ట్రైనింగ్ కు ఎంపికయ్యారు... వీరికి ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా షేక్ గన్లూర్ హఫిజున్ ఎంత కష్టపడి ఉద్యోగాన్ని సాధించిందో వివరించింది... ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు.
నేటి తరం అమ్మాయిలకు హఫిజున్ ఆదర్శం...
''నువ్వు ముస్లిం అమ్మాయివి... ఈ పోలీస్ జాబ్ నీకేందుకు... అంతగా కావాలంటే బిఈడి పూర్తిచేసి టీచర్ జాబ్ చెయ్... పోలీస్ జాబ్ నీతో సాధ్యంకాదు'' చాలామంది నిరుత్సాహపర్చారని హఫిజున్ సిఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ముందు తెలిపారు. కానీ వారి మాటలను తాను ఛాలెంజ్ గా తీసుకున్నాను... పోలీస్ జాబ్ సాధించానని గర్వంగా తెలిపింది. తనలాగే చాలామంది అమ్మాయిలు మరీముఖ్యంగా ముస్లిం అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి... వాటిని నిజం చేసుకునే అవకాశం ఇవ్వండి... అంతేగానీ పెళ్లిచేసి భారం దించుకున్నట్లు ఫీల్ కావద్దని తల్లిదండ్రులకు హఫిజున్ సూచించారు. అమ్మాయిలను సొంతవాళ్లే అణగదొక్కుతుంటారని... ఈ పరిస్థితి మారాలని షేక్ గన్లూర్ హఫిజున్ సూచించారు.

