Asianet News TeluguAsianet News Telugu

పొమ్మనకుండా పొగబెడుతున్న టి సర్కార్

  • విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో టి సర్కార్
  • అందుకనే ఏపి ప్రభుత్వ హెచ్చరికల బేఖాతరు
  • విద్యుత్ ఉత్పత్తిలో టి సర్కార్  స్వయం వృద్ధి సాధించటమే కారణం
power production

ఆంధ్ర ప్రదేశ్ నుండి సరఫరా అవుతున్న విద్యుత్ ఆగిపోవటం అంటే తెలంగాణా ప్రభుత్వం నెత్తిన పాలుపోసినట్లేనా? తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన బకాయిల చెల్లింపు, విద్యుత్ సరఫరా నిలిపివేత హెచ్చరికలు గమనించిన విద్యుత్ రంగ నిపుణులు అవుననే అభిప్రాయపడుతున్నారు.

విద్యుత్ సరఫరా, ఉత్పత్తి విషయంలో తెలంగాణా ప్రభుత్వం స్వయంవృద్దికి చేరుకోవటమే అందుకు కారణంగా చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇరు రాష్ట్రాల మధ్య రెండేళ్ళ క్రితం జరిగిన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

అందుకే బకాయిల చెల్లింపు విషయంలో ఏపి హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అయితే ఒప్పందాల రద్దు విషయంలో ముందుగా తనంతట తానుగా ఏపికి ప్రతిపాదన పంపకూడదని నిర్ణయించుకున్న తెలంగాణా ప్రభుత్వం  ఒప్పందాల రద్దు విషయంలో ‘పొమ్మనకుండా పొగపెట్టినట్లు’గా వ్యవహరిస్తోందని సమాచారం. దాంతో ఏమి చేయాలో తెలీక ఏపి ప్రభుత్వం ఇపుడు గింజుకుంటోంది.

   2014లో జరిగిన రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అప్పటి కేంద్రప్రభుత్వం చట్టం చేసింది. అయితే, సదరు చట్టానికి ఇరు రాష్ట్రాలూ పెద్దగా విలువ ఇవ్వలేదు. దాంతో అప్పటి నుండి విద్యుత్ విషయాల్లో తరచూ వివాదాలు రేగుతునే ఉన్నాయి.power production

 

అయితే, ఈ రెండేళ్ళల్లో తెలంగాణా ప్రభుత్వం కొన్ని ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్ధలతో ఒప్పందాలు చేసుకోవటం, ఛత్తీస్ ఘర్ నుండి విద్యుత్ సరఫరా వచ్చే మార్చి నెలలో అందుబాటులోకి వస్తుండటం, సింగరేణి వంటి సంస్ధలు విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టటం, బహిరంగ మార్కెట్ లో యూనిట్ ధర బాగా తగ్గిపోవటం లాంటి అనేక కారణాల వల్ల ఏపి నుండి విద్యుత్ కొనుగోలు భారంగా మారిందని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. 2014 ఒప్పందాల ఫలితంగా ఇప్పటికీ  యూనిట్ ధరకు తెలంగాణా ప్రభుత్వం సుమారు 8 రూపాయలు చెల్లిస్తోంది.

  అయితే, ఈ రెండేళ్ళలో ఇరు రాష్ట్రాల్లోనూ విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఏపిలో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, తెలంగాణాలో కూడా విద్యుత్ ఉత్పత్తి పెరగటంతో పాటు ఏపి సరఫరా చేస్తున్న యూనిట్ ధరకన్నా మరింత తక్కువకే విద్యుత్ అందివ్వటానికి ఛత్తీస్ ఘర్ ముందుకు వచ్చింది. దాంతో తెలంగాణా వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.

 ఏపి నుండి ప్రధానంగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుండి 1760 మెగావాట్లు, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుండి 1650 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణా కొనుగోలు చేస్తోంది. అంటే, ఏపి నుండి తెలంగాణాకు 3410 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవతోంది. అదే రీతిలో తెలంగాణాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుండి 1720 మెగావాట్లు, భూపాలపల్లి విద్యుత్ స్టేషన్ నుండి 500 మెగావాట్ల విద్యుత్ ను ఏపి కొనుగోలు చేస్తోంది. అంటే తెలంగాణా నుండి 2220 మెగావాట్ల విద్యుత్ ఏపికి అందుతోంది. మళ్ళీ ఇందులో ఇరు రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ లో 54 శాతం, 46 శాతం వాటాలున్నాయి.

  ఇదిలావుండగా, ఛత్తీస్ ఘర్ నుండి వచ్చే మార్చికల్లా వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఇక సింగరేణి నుండి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇటీవలే మొదలైంది. దానికి తోడు ఏపి ఇపుడు అందిస్తున్న యూనిట్ ధరకన్నా తక్కువకే అందిస్తామంటూ పలు ప్రైవేటు ఉత్పత్తి సంస్ధలు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతిపాదనలు పంపాయి. దాంతో ఏపి నుండి విద్యుత్ కొనుగోలు చేయకపోయినా ఇబ్బంది లేదని కెసిఆర్ గ్రహించారు.

దాంతో అప్పటికే ఏపికి చెల్లించాల్సిన బకాయిలను పట్టిచుకోవటం మానేసారు. అంతేకాకుండా ఏపితో విద్యుత్ సరఫరా ఒప్పందాలను ఎలా వదిలించుకోవాలా అని కిసిఆర్ యోచిస్తున్నారు. తనంతట తానుగా ఒప్పందాల రద్దుకు ప్రతిపాదనలు పంపితే అవకాశంగా తీసుకుని ఏపి రచ్చ చేస్తుందేమోనని సమయం కోసం వేచి చూస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే మంగళవారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కో ఆర్డినేషన్ కమిటి (ఎస్ఆర్ పిసిసి)  సమావేశంలో విద్యుత్ బకాయిలు చెల్లించక తెలంగాణాకు తక్షణమే సరపరాను నిలిపేస్తామనే హెచ్చరికలు ఏపి నుండి వెలువడ్డాయి. అటువంటి హెచ్చరికలను ఒప్పందాల రద్దుకు అవకాశంగా తీసుకోవాలని తెలంగాణా  ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

  ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా తలెత్తిన విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం రచ్చకెక్కిన నేపధ్యంలో ఒప్పందాలు రద్దు చేసుకోవటమే మేలని విద్యుత్ రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఏపి నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం తెలంగాణా ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని అంటున్నారు.

అదే విధంగా తెలంగాణా ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశ్యంతో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏపి ప్రభుత్వానికి కూడా ఉండదు. ఈ పరిస్ధితుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏపి ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు తెలంగాణా ప్రభుత్వం నెత్తిన పాలు పోసినట్లే.

ఇరు రాష్ట్రాలూ విద్యుత్ వివాదాల పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని నియమించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒప్పందాలు రద్దు చేసుకునే విషయంలో ఇరు రాష్ట్రాలూ ఒక నిర్ణయానికి వస్తే బకాయిల చెల్లింపు అన్నది పెద్ద విషయం కాదని నిపుణులు అంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios