అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడం అంటే తనకు ఒక అలవాటుగా మారిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకిల్ పై ప్రజలు ప్రయాణం చేశారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. తెలంగాణలో కారు ప్రయాణం చేశారని అంటూ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లు సాధిస్తుందని పరోక్షంగా చెప్పారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు. ఈ రోజు తాను చెబుతున్నది తాను పరిశీలించిన విషయమని ఆయన చెప్పారు. రేపు చెప్పబోయేది తమ టీమ్ చేసిన సర్వే ఫలితాలు చెబుతానని ఆయన అన్నారు. 

తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని తాను తటస్థంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వే ఫలితాలు తేడా వచ్చాయన్నారు. తేడా వచ్చింది కదా అని తాను వదిలెయ్యలేదని అయినా మళ్లీ సర్వే చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

తాను ఆదివారం తిరుపతి వెళ్తున్నానని అక్కడ ఎన్నికలపై సర్వే ఫలితాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు, ఏపీలోని లోక్ సభ, అసెంబ్లీ ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కారు ఎక్కితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ ఎక్కేశారని లగడపాటి స్పష్టం చేశారు. 

ఏదో ఒక పార్టీకే ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలన్నదే తమ అభిమతమన్నారు.   

తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపైనే  కాకుండా కేంద్రప్రభుత్వంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రత్యేక దృష్టిలో చూడటం జరిగిందన్నారు లగడపాటి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు ఎలా వస్తాయి అనే దానిపై ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

తాను అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. వారంతా మనం కోరుకోకుండానే రాష్ట్రం విడిపోయిందని రాష్ట్రం వచ్చింది  కానీ రాజధాని లేదు, నిధులు లేవు అని వారంతా ఆందోళన చెందారని తెలిపారు. 

తాము ఎక్కడ ఉన్నా చివరకు చేరాల్సిందే ఆంధ్రప్రదేశ్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆరా తీశారని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛంధంగా భూములు ఇచ్చారంటూ లగడపాటి రాజగోపాల్ అభినందించారు. 

ఎన్నికల ఫలితాలపై రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారి కోరికలను వారి ఆశలను సార్థకం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది కాబట్టే పాలకుడి కోసం వారంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

రాష్ట్ర రాజధాని అభివృద్ధి భాగా జరుగుతుందని, ప్రాజెక్టులు ఎంతో చక్కగా జరుగుతున్నాయని కేంద్రం నుంచి నిధులు కాస్త అటు ఇటు అయినా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలా జరుగుతుందని రైతులకు తాను స్పష్టం చేసినట్లు లగడపాటి తెలిపారు. 

గతంలో మహిసభగురించి చెప్పుకునే వారని అయితే ప్రస్తుతం రాబోయే రోజుల్లో మన శాసన సభ గురించి కూడా చెప్పుకుంటారని అభిప్రాయపడ్డారు. రాజధాని అభివృద్ధి బాగా జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. 

ప్రత్యేక హోదా రాకుండానే కియా , అశోక్ లే ల్యాండ్, హీరో, విశాఖపట్నం జిల్లాలో అనేక ఐటీ పరిశ్రమలు వచ్చాయని మరిన్ని వచ్చే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా వచ్చే ఐటీ, కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉందన్నారు. 

40వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ తరహాలో రాజధానిని నిర్మించిన ఘనత ఎక్కడా లేదన్నారు. ఢిల్లీ రాజధాని యమునా నదితీరాన నిర్మించారని కానీ అక్కడ నీరు ఉండదని మన రాష్ట్ర రాజధానిని కృష్ణా నదీ తీరాన అమరావతిలో నిర్మించడం జరిగిందన్నారు. ఎప్పుడూ కృష్ణానదీ ఎండిపోదని నీటితో కలకలలాడుతుందన్నారు. 

పోరాటాలతో పార్టీలు తలొగ్గే పరిస్థితి లేదన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు ఉండేవి కాబట్టి బలంగా ఉండేవాళ్లమని రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఆ పరిస్థితి మారిందన్నారు. కాబట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసే ఏదైనా సాధించగలుగుతామన్నారు. 

ఈనెల 19న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తానని గతంలోనే లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన శనివారం అంటే ఒకరోజు ముందే ఎన్నికల ఫలితాలపై స్పందించడం విశేషం. 

ఇప్పటి వరకు కేవలం టీజర్ మాదిరిగా ఫలితాలపై తన సర్వే ఫలితాలను వెల్లడించిన లగడపాటి రాజగోపాల్ ఆదివారం సాయంత్రం పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి.  

ఈ వార్తలు కూడా చదవండి

హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు, పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం : లగడపాటి

ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్

పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెడ్తాడు, మెగాస్టార్ కన్నా తక్కువ సీట్లే: లగడపాటి