హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అనూహ్యమైన సంఘటన ఆ ప్రశ్నకు తావిస్తోంది. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. 

జనసేన కీలక నేతలు శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పవన్ కల్యాణ్ వ్యక్తిగత సహాయకులు వేణు, చక్రవర్తి పాల్గొన్నారు. వైసిపి తరఫున ఎవరు పాల్గొన్నారనేది స్పష్టం కావడం లేదు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల ఓ హోటల్లో వారు సమావేశమయ్యారు. 

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపైనే కాకుండా పలు కీలక విషయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత ఇరు పార్టీల నేతలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతారని కూడా అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, తాము పొత్తు పెట్టుకుంటామనే ప్రచారాలను నమ్మవద్దని జగన్ ఇటీవల ప్రజా సంకల్ప యాత్రలో చెప్పారు. తాము రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ స్థితిలో వారు పొత్తుపై చర్చిస్తారా అనేది సందేహమే.