హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) AMCA, LCA ఉత్పత్తిని కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలనిచంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై క‌ర్ణాట‌క నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్లు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ను ఆంధ్రప్రదేశ్‌కి తరలించాల్సిన అవసరం లేదని కర్ణాటక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విష‌య‌మై పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్‌ స్పందిస్తూ.. "చంద్రబాబు గారు తమ రాష్ట్రంలో కొత్తగా HAL ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల‌ని కోరుకోవ‌చ్చు. కానీ బంగళూరులో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న HAL‌ను అక్కడికి తీసుకెళ్లాలనడం సరైంది కాదు" అని అన్నారు.

ఇక ఇదే విష‌య‌మై మాజీ ఎంపీ డీకే సురేష్ మాట్లాడుతూ.. "HAL గత 50 ఏళ్లుగా బంగళూరులో ఉంది. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణం, సదుపాయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థించినందుకే కేంద్రం సంస్థను తరలించదు. ఇది చిన్న విషయం కాదు. అని చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న‌పై బీజేపీ ఎంపీ గోవింద్ కారజోళ కూడా అభ్యంతరం వ్య‌క్తం చేశారు. "మోదీ అధ్యక్షతన జరిగిన నితి ఆయోగ్ సమావేశానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకాలేకపోవడం వల్లే ఇలాంటి అభ్యర్థనకు అవకాశమొచ్చిందన్న భయం ఉంది. HAL ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వకూడదు" అని స్పష్టం చేశారు.

ఇక ఎంపి పాటిల్ మాట్లాడుతూ.. "దేశ రక్షణ ఉత్పత్తుల్లో కర్ణాటక 65% వాటా కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడులా కర్ణాటకకూ డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని రక్షణ మంత్రిని త్వరలో కలిసి విజ్ఞప్తి చేస్తాం" అని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో చ‌ర్చ‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేస్తున్న ఐదవ తరం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA), లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఉత్పత్తిని కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని ప్రతిపాదించారు.

అయితే బెంగళూరు విమానాశ్రయం సమీపంలో HAL AMCA సౌకర్యం కోసం భూమిని ఇప్పటికే గుర్తించారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌ను కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. దీనికోసం 10 వేల ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.