Farmers support: మామిడి, పొగాకు, కోకో రైతులకు గిట్టుబాటు ధరతో రూ.550 కోట్ల సహాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Farmers support: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మామిడి, పొగాకు, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.550 కోట్ల స్థిరీకరణ నిధిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత వివరాలు వెల్లడించారు.

నల్ల బర్లీ పొగాకు పంట కొనుగోలుకు రూ.350 కోట్లు ఖర్చవుతున్నప్పటికీ, ఆ భారం ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కొనుగోళ్లు మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్రంలోని 7 మార్కెట్ యార్డుల్లో శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

అలాగే, మామిడి పంటకు గిట్టుబాటు ధరగా ప్రభుత్వం కిలోకు రూ.12 చెల్లించనుంది. ఇందులో రూ.8 ప్రాసెసింగ్ కంపెనీలు ఇవ్వగా, మిగతా రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేయడం వల్ల రూ.150 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని చెప్పారు.

Scroll to load tweet…

కోకో పంట విషయంలో కూడా ఒక్క కిలోకు రూ.450 కంపెనీలు చెల్లిస్తే, అదనంగా రూ.50 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 1000 మెట్రిక్ టన్నుల కోకో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. దీని కోసం రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పంటల కోసం చెల్లించబోయే మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో రైతులకు నేరుగా లాభం కలుగుతుందన్నారు.

Scroll to load tweet…

మిగిలిన 25 మిలియన్ కిలోల నల్లబర్లీ పొగాకును కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులు ఈ పొగాకు స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తోందని, ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.