విజయవాడ పోలీసులు కేసుల దర్యాప్తు కోసం ఏఐ టూల్ అభివృద్ధి చేశారు. ఫిర్యాదు నుంచి రిమాండ్‌ వరకు ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది.

విజయవాడ పోలీసులు కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ కోసం ‘అస్త్రం’ అనే కృత్రిమ మేధ టూల్‌ను విజయవంతంగా ఉపయోగించిన వారు, ఇప్పుడు నేరాల విచారణలోనూ అదే దారిలో ముందుకెళ్తున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో అభివృద్ధి చేసిన కొత్త ఏఐ టూల్‌ను ప్రయోగాత్మకంగా పటమట పోలీస్ స్టేషన్‌లో పరీక్షిస్తున్నారు.

మొబైల్ లేదా ట్యాబ్‌లో యాప్‌…

ఈ టూల్‌ సహాయంతో ఫిర్యాదు ఇచ్చిన మొదటి క్షణం నుంచే వ్యవస్థ దర్యాప్తు అధికారికి సహాయం చేస్తుంది. మొబైల్ లేదా ట్యాబ్‌లో యాప్‌ను ఓపెన్ చేసి రికార్డర్ ఆన్ చేస్తే బాధితుడు చెబుతున్న విషయాలను అది టెక్స్ట్‌గా మార్చి, తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ ఫిర్యాదు కాపీ సిద్ధం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో సూచిస్తుంది. అవసరమైన చోట మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు.

నిందితుడి కదలికలు..

ఘటనాస్థలానికి వెళ్లిన తరువాత ఫోటో తీస్తే, టూల్ ఆ చిత్రం ఆధారంగా ఆనవాళ్లు, వస్తువులు గుర్తించి, నిందితుడి కదలికలు అంచనా వేస్తుంది. ఇది క్లూస్‌ టీమ్ చేసే ప‌నిలో ఓ భాగాన్ని స్వయంగా నిర్వర్తిస్తుంది. దర్యాప్తులో ఏ అంశాలపై దృష్టి పెట్టాలో కూడా సూచనలు ఇస్తుంది.

అరెస్టు అనంతరం నిందితుడిని కోర్టుకు పంపేందుకు అవసరమైన రిమాండ్ రిపోర్టును సిద్ధం చేయడంలోనూ ఇది కీలకంగా మారుతుంది. గత కోర్టు తీర్పులను ఆధారంగా చేసుకుని, రిమాండ్‌కు అవసరమైన ముఖ్య అంశాలను స్పష్టంగా అందిస్తుంది.

ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు పంపాలన్నా, ఇతర జిల్లాల పోలీసులకు లేఖలు తయారు చేయాలన్నా, కోర్టు మెమోలు, పంచనామా నివేదికలు సిద్ధం చేయాలన్నా ఈ టూల్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల ఊహాచిత్రాలు తదితర అంశాలకూ ఈ టూల్‌ను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు కమిషనర్ రాజశేఖర్‌బాబు తెలిపారు.

టెక్నాలజీని కలిపి..

ఈ విధంగా విజయవాడ పోలీస్ వ్యవస్థ, దర్యాప్తులో టెక్నాలజీని కలిపి, తీక్షణమైన, వేగవంతమైన న్యాయ ప్రక్రియ సాధించేందుకు ముందు అడుగులు వేస్తోంది.