Pawan Kalyan: చెట్లే మనిషి ఆనవాళ్లు.. వన మహోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న వన మహోత్సవంలో 5 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రకటించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో "వన మహోత్సవం"
Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం మరో ముందడుగు వేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో వన మహోత్సవాన్ని నిర్వహించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి-అటవీ,పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పిలుపునిచ్చారు.
చెట్లే మనిషి ఆనవాళ్లు.. అవి లేకపోతే జీవితం లేదు: పవన్ కళ్యాణ్
చెట్లే మనిషి ఆనవాళ్లు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పవన్ లక్ష్యంగా ప్రకటించిన విషయాలు రాష్ట్ర పర్యావరణ దిశను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మన చిన్ననాటి రోజుల్లో చెట్లు గుర్తుల్లా ఉండేవి. చెట్లు లేకపోతే జీవితం ఊహించలేము. చెట్టు మనకు ఆధారం. చెట్లు, అడవులు, ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని తెలిపారు.
ఒక్కరోజే కోటి మొక్కలు
ఈ ఒక్కరోజే కోటి మొక్కలు నాటడంతో పాటు వచ్చే ఏడాది ఐదు కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కార్చిచ్చుల నివారణ కోసం గొర్రెల కాపరులకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ, దీనిపై ప్రణాళిక సిద్ధంగా ఉందని వివరించారు.
ఏపీలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యం : చంద్రబాబు నాయుడు
వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. “పచ్చదనం ప్రాధాన్యతను గుర్తించి నగర వనాలు, అడవుల సంరక్షణ, కార్చిచ్చుల నిరోధం, మొక్కల పెంపకం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించామని” తెలిపారు. గతంలో అమలు చేసిన "నీరు–చెట్టు" కార్యక్రమం విజయవంతమైందని గుర్తుచేశారు.
అటవీ శాఖ సలహాదారుగా అంకారావు
నల్లమల అడవుల పరిరక్షణకు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కొమ్మిర అంకారావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అటవీ పరిరక్షణలో ఆయన సేవలను గుర్తించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంకారావును అటవీ శాఖ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, అమరావతి డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ అధికారులు అనంతరాము, ఎ.కె.నాయక్ తదితరులు పాల్గొన్నారు.