Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో విద్యార్థినులపై జరిగిన దాడి కలకలం రేపింది. చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన పదో తరగతి బాలికపై ఓ గుర్తుతెలియని వ్యక్తి రంపంతో దాడి చేశాడు.
పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై విచక్షణారహితంగా దాడి
రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక తరగతి గదిలో ఉండగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న చెట్ల కొమ్మలు కోసే రంపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బాలికపై దాడిని గమనించిన మరో విద్యార్థిని ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, దుండగుడు ఆమెపైనా దాడి చేసినట్లు సమాచారం. దీంతో రెండో బాలికకు కూడా గాయాలయ్యాయి. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో పాఠశాలలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో అర్థంకాక విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ప్రధాన బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు.. దాడికి కారణాలపై ఆరా
విద్యార్థినిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి బాధిత బాలికతో ముందుగా పరిచయం ఉందా? వ్యక్తిగత విభేదాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పిల్లలకు రక్షణ కల్పించాల్సిన విద్యాసంస్థలోనే ఇలాంటి ఘటన జరగడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకుని, దాడి వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.
ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు
రాప్తాడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే విద్యార్థినిపై దాడి జరగడాన్ని అమానుష చర్యగా అభివర్ణించారు. గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న ఆయన, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే పట్టుకుని, చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు.
మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరగతి గదిలో రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి మనసు కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం అందించాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






