Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో రెండో రోజు కీలక సమావేశాలతో బిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
మోదీతో గంటన్నర భేటీ.. నదుల అనుసంధానంపై కీలక చర్చ
ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. సెవెన్ లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి, గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాది రాష్ట్రాలకు నీటి లభ్యత గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు.
దేశంలో రహదారుల నెట్‌వర్క్, పవర్ గ్రిడ్ తరహాలో భవిష్యత్‌లో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలంటే నదుల అనుసంధానం కీలకమని చంద్రబాబు వివరించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీటి రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
ఏపీలో 53 శాతం లోటు వర్షపాతం.. వ్యవసాయంపై ప్రభావాన్ని వివరించిన సీఎం
ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు ప్రధానికి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రభావాన్ని వివరించి, రైతులకు ఇబ్బందులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలియజేశారు. మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి కూడా ప్రధానికి వివరించారు. ఉద్యాన పంటలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు రైతుల ఆదాయం పెంచేలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రస్తావించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు.
పోలవరం, జలజీవన్ మిషన్.. నిధుల విడుదలపై కేంద్రానికి విజ్ఞప్తి
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన చంద్రబాబు పోలవరం నిర్మాణ పురోగతిని సమీక్షించారు. సుమారు రూ.30 వేల కోట్లతో చేపడుతున్న జల్‌జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర మంత్రికి అందించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేకుండా కేంద్రం నుంచి అవసరమైన సహకారం కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించేలా జల్‌జీవన్ మిషన్-అమరజీవి జలధార పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాధాన్య పనులకు నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐదు నదుల అనుసంధానం అంశంపైనా చర్చించారు.
అమరావతి ఓఆర్‌ఆర్, బీచ్ రోడ్డు.. భారీ రహదారి ప్రాజెక్టులపై దృష్టి
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సహకారం కోరారు. సుమారు 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ ఓఆర్‌ఆర్ రాజధాని అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటుందని చంద్రబాబు వివరించారు.
రాష్ట్ర తీర ప్రాంత అభివృద్ధికి బీచ్ రోడ్డు ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తీరంలోని నగరాలు, పర్యాటక ప్రాంతాలు, పోర్టులు, పారిశ్రామిక కేంద్రాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని వివరించారు. పోలవరం వద్ద ఎడమ, కుడి గట్లను అనుసంధానించే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన రహదారులు, వంతెనల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.
అమిత్ షా, పీయూష్ గోయల్‌తో భేటీలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. పోలవరం పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జి వంటి అంశాలపైనా చర్చించారు.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన భేటీలో ఏపీలో పోర్టుల విస్తరణకు అవసరమైన భూముల అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పోర్టుల అభివృద్ధి కోసం 20,378 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే పర్యటనలో ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసిన సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలను ప్రశంసిస్తూ.. దూరదృష్టి, క్రమశిక్షణ, నిర్ణయాత్మక నాయకత్వంతో భారత్‌ను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకుని వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధించే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను కూడా ప్రధానికి వివరించారు.


