అమరావతి: తాను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోలేదని, అయితే పది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెసు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలుగుదేశం పార్టీ చీరాల టీడీపి శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చర్చల తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీపై ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇక్కడ ఉందా, పాకిస్తాన్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. వివాదాలు సృష్టించి తన నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ చీరాలకు వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ పర్యటనను అడ్డుకున్నారని ఆయన అన్నారు. 

లోకేష్ ఎందుకు రాలేదని అడిగితే పార్టీ అధిష్టానం నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను తనకు తెలియకుండా రద్దు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. కులం గురించి ఇప్పుడు మాట్లాడను గానీ చీరాలలో తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రస్తుత పరిణామాలపై తోట త్రిమూర్తులతో చర్చించి సలహాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ, కులపరమైన చర్చలు జరిపిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వివాదాలు సృష్టించే శక్తులు పార్టీలోనే ఉన్నాయని ఆయన అన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరని, సమస్యలే తన శత్రువులని ఆమంచి వ్యాఖ్యానించారు.  చంద్రబాబుతో చర్చలు సంతృప్తినిచ్చాయని, అయితే తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో ముగిసిన భేటీ: పార్టీ మార్పుపై తేల్చని ఆమంచి

పార్టీ మార్పు పుకార్లు:చంద్రబాబుతో ఆమంచి భేటీ

శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు