అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నారు. స్థానికంగా పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఇవాళ జగన్‌తో భేటీని ఆమంచి కృష్ణమోహన్‌ వాయిదా వేసుకొన్నారు.

మంగళవారం నాడు చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో తన అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్‌ భేటీ అయ్యారు.  టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆమంచి కృష్ణమోహన్  తీవ్ర  అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పాలేటీ రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల నుండి తనకు సహకారం లేదని  ఆమంచి పార్టీ నాయకత్వం వద్ద ప్రస్తావించారు.

ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశమైన విషయాన్ని తెలుసుకొన్న మంత్రి శిద్దా రాఘవరావు  మంగళవారం సాయంత్రం ఆమంచి కృష్ణమోహన్‌తో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని  ఆమంచిని కోరారు.

ఆమంచి సమక్షంలోనే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌తో మంత్రి శిద్దా రాఘవరావు ఆమంచి కృష్ణమోహన్‌తో మాట్లాడించారు. వాస్తవానికి  బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో ఆమంచి కృష్ణమోమన్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది.  కానీ, మంత్రి శిద్దా రాఘవరావు చొరవతో ఆమంచి కొంత మెత్తబడినట్టు కన్పిస్తోంది.

బుధవారం మధ్యాహ్నాం మూడు గంటల సమయంలో  ఏపీ సీఎం చంద్రబాబుతో ఆమంచి కృష్ణమోహన్‌ భేటీ కానున్నారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ఆమంచి కృష్ణమోహన్  బాబుకు వివరించనున్నారు. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్  పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై  కూడ పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడ అన్వేషిస్తున్నారు.