ఎన్టీఆర్ జిల్లాలో దారుణం... కాలువలోకి దూసుకెళ్లిన కూలీల ఆటో, మహిళ మృతి

Aug 11, 2022, 4:12 PM IST

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట సమీపంలోని పెనుగంచిప్రోలు గ్రామ శివారులో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆటో అమాంతం రోడ్డుపక్కనే వున్న నీటికాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్ధలికి చేరుకుని గాయపడిన మహిళలను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వత్సవాయి మండలం పాత వేమవరంకు చెందిన మహిళలు షేరింగ్ ఆటోలో పెనుగంచిప్రోలు గ్రామానికి వరినాట్ల కోసం బయలుదేరి మార్గమధ్యలో ఇలా ప్రమాదానికి గురయ్యారు. మహిళ మృతి, మరికొందరు మహిళలు రోడ్డుప్రమాదంలో గాయపడటంతో వేమవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.