Mar 28, 2023, 5:03 PM IST
విశాఖపట్నం : తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా ఇవాళ విశాఖ జల్లాలోని ప్రాచీన హిందూ దేవాలయం సింహాచలంను సందర్శించారు. భక్తులు సింహాద్రి అప్పన్నగా కొలిచే లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు మంత్రి. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ది పనుల ప్రారంభించడానికి ప్రభుత్వం ఇప్పటికే సిద్దమైన నేపథ్యంలో దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి రోజా మాట్లాడుతూ... రోజురోజుకు సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలోనే ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీంలో చేర్చినట్లు... నిధుల మంజూరు, పనుల నిర్వహణపై చర్చించేందుకే ఈ సమీక్షా సమావేశం ఏర్పాటుచేసామన్నారు. రూ.54 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు... వారం రోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలవడం జరుగుతోందని మంత్రి అన్నారు. ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కోసం కావాల్సిన పనులపై ఆలయ ఈఓతో పాటు అధికారులతో చర్చించినట్లు మంత్రి రోజా తెలిపారు.