Sep 22, 2022, 3:42 PM IST
తాడేపల్లి : ఒకే బస్సులో ఏకంగా 70-80 మందిని అదీ అమ్మాయిలు, అబ్బాయిలను కుక్కి తీసుకెళుతున్న ఓ కార్పోరేట్ కాలేజ్ యాజమాన్యంపై గుంటూరు జిల్లా ఉండవల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసికూడా తమ పిల్లలకు సరయిన సౌకర్యాలు కల్పించడంలేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకే బస్సులు ఇలా కుక్కి తీసుకెళ్లడంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ శ్రీ చైతన్య కాలేజీ బస్సును ఆపి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు తెలుగుదేశం విద్యార్థి విభాగం మద్దతుగా నిలిచింది.
కేవలం ఆందోళనతో ఆగకుండా కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని ప్రమాదకరంగా తరలిస్తున్నారంటూ పోలీసులకు తెలిపారు. దీంతో వారంరోజుల్లో సమస్య పరిష్కరించాలని స్కూల్ యాజమాన్యాన్ని పోలీసులు హెచ్చరించారు.