`పలాస` చిత్రంతో నటుడిగా మెప్పించాడు రక్షిత్ అట్లూరి. మాస్ తాలూకు ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఇప్పుడు `నరకాసుర` చిత్రంతో వస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. అజ్ఞా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 3)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
శివ(రక్షిత్ అట్లూరి).. కర్నాటక, కేరళా బార్డర్‌లో ఓ కాఫీ ఎస్టేట్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఆ ఎస్టేట్ పెద్ద, ఎమ్మెల్యే నాగమ నాయుడు( చరణ్ రాజ్)కి నమ్మిన బంటుగా ఉంటాడు. ఎమ్మెల్యేగా నాగమ నాయుడు చేయాలనుకున్న మంచి పనులకు సపోర్ట్ గా నిలుస్తూ, అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తుంటాడు శివ. ఓ రోజు అనుకోకుండా లారీ లోడ్‌తో కనిపించకుండా పోతాడు. దీంతో అంతా శివ కోసం వెతుకుతుంటారు. దీన్ని స్థానిక ఎస్ ఐ విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయనకో నిజం తెలుస్తుంది. ఎస్టేట్‌లో పనిచేసే అమ్మగారు మీనాక్షి(అపర్ణ జనార్థన్)తో, శివకి సంబంధం ఉందని, ఆ విషయాన్ని మీనాక్షిని అడగ్గా, అసలు విషయాన్ని చెబుతుంది. ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు వెల్లడిస్తుంది. అందులో భాగంగానే వాళ్లిద్దరు కేరళా ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత శివ మాయమవుతాడు. అంతా ఆందోళన చెందుతున్న సమయంలో శివ కొందరు హిజ్రాలతో కలిసి ఎస్టేట్ కి వస్తాడు శివ. ఆ తర్వాత శివ చేసిన మంచి పనికి మెచ్చిన ఎమ్మెల్యే..శివ, మీనాక్షిల విషయం తెలిసి, వారికి పెళ్లి చేస్తాడు. అక్కడే ఎమ్మెల్యే కొడుకు ఆది నాయుడికి కాలుతుంది. అతను కూడా మీనాక్షిని ఇష్టపడతాడు. మరి ఆది నాయుడు మీనాక్షి కోసం ఏం చేశాడు? శివ ఎందుకు మిస్ అయ్యాడు, హిజ్రాలతో ఎందుకొచ్చాడు? ఎమ్మెల్యేకి, శివ మధ్య తలెత్తిన వివాదం ఏంటి? ఊర్లో హత్యలకు కారణం ఎవరు? హిజ్రాల గురించి చెప్పిన గొప్పతనమేంటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
హిజ్రాలకు సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది. వాళ్లు జనాల వద్ద డబ్బులు అడుగుతూ జీవనం సాగిస్తుంటారు. దీంతో అంతా వారిని చులకనగా చూస్తుంటారు, వారిపై నీచంగా కామెంట్లు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వారిని మనుషులుగా గుర్తించరు. ఇటీవల కొన్ని ప్రభుత్వాలు మాత్రమే వారికి గుర్తింపుతోపాటు గౌరవాన్ని ఇస్తున్నాయి. అయితే బయటకు కనిపించే హిజ్రాల ఇన్నర్ జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల ట్రెడిషన్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సెబాస్టియన్. నిజానికి ఈ కథలో మొదట హిజ్రాలు అనే పాయింట్ లేదు. కానీ మంత్రి కేటీఆర్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని వారికోసం, వారి గొప్ప తనం చెప్పేలా `నరకాసుర` చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు తెలిపారు. అన్నట్టుగానే వారిని హైలైట్ చేస్తూ ఈ సినిమాని రూపొందించారు.
ఎమ్మెల్యే నుంచి, కూలీల వరకు, చివరికి పోలీసులు, ఎస్టేట్ సూపర్ వైజర్ సహా అంతా శివ కోసం వెతుకుతుండటం నుంచి ఈ సినిమా ప్రారంభమైంది. అలా శివ పాత్రపై ఆసక్తిని పెంచింది. దీనికితోడు శివ పాత్ర ఎంతటి బలమైనదో చూపించే ప్రయత్నం చేశారు. కాఫీ ఎస్టేట్‌లో పంట కోయాలంటే జనం కిందపడి చనిపోతున్నారు. దానికి ఓ మార్గం చూపేలా, ఎస్టేట్ తిరిగి రన్ అయ్యేలా చేయడంలో శివ ముఖ్య పాత్ర పోషిస్తాడు. తెరవెనుక ఉండి నడిపిస్తుంటాడు. అయా సీన్లు ఎంగేజింగ్‌గా ఉంటాయి. మరోవైపు తన మరదలు వీరమణి( సంకీర్తన విపిన్) శివని ఎంతో ఇష్టపడుతుంది, కానీ అతను పట్టించుకోడు. ఈ క్రమంలో ఆమె లవ్ సీన్లని చూపించి ఎంగేజ్ చేశారు. మొదటిభాగం అంతా సస్పెన్స్ తో సరదాగా తీసుకెళ్లారు. శివని ఎతికే క్రమంలో మీనాక్షి చెప్పిన అసలు కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సహజీవనం స్టోరీ నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో అది కొంత శృతి మించినట్టు ఉంటుంది.
ఇక సెకండాఫ్ సీరియస్‌గా తీసుకెళ్లాడు, హిజ్రాల గొప్పతనం చూపించాడు. వాళ్లు ఎంత నిష్టతో, ఎంత గొప్పగా, ఎంత మంచి మనసుతో ఉంటారో ఇందులో చెప్పాడు దర్శకుడు. వారిని మనిషిలా గుర్తిస్తే, మనకోసం ప్రాణాలైనా ఇస్తారనే విషయాన్ని చెప్పిన తీరు బాగుంది. శివ వారిని చేరదీసి పని కల్పించడంతో శివ కోసం వారు తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు ముందుకు రావడం వారి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇలా ఈ సినిమా హిజ్రాలపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరోవైపు శివ పాత్రని బలంగా చూపించాడు. ఆయన ఎంత శక్తివంతుడు, ఏ పరిస్థితుల్లో శివ నరకాసురుడిగా మారతాడో అయా సీన్లు బాగున్నాయి. అదిరిపోయేలా ఉన్నాయి. మరోవైపు యాక్షన్ సీన్లు నెక్ట్స్ లెవల్‌ల్లో ఉన్నాయి. హిజ్రాల యాక్షన్ సీన్లు కూడా బాగా మెప్పిస్తాయి. హైలైట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సీన్‌ని మాత్రం వాహ్ అనేలా ఉంటుంది. సినిమాలో అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయ్యింది. కానీ ట్విస్ట్ లు థ్రిల్ చేసేలా ఉన్నాయి. కొంత సాగదీత ఇబ్బంది పెట్టే అంశం. కామెడీ సీన్లు మరింత బాగా డిజైన్ చేసి ఉండాల్సింది. బలమైన కథ లేకపోవడం పెద్ద మైనస్. చాలా సీన్లలో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు, దీంతో ఆడియెన్స్ కి కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. స్క్రీన్‌ప్లేని పరుగులు పెట్టిస్తే ఇంకా బాగుండేది. కొన్ని సీన్ల వరకు బాగున్నాయి.
నటీనటులః
శివ పాత్రలో రక్షిత్ అట్లూరి బాగా చేశాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. లవ్ సీన్లలోనూ మెప్పించాడు. కాకపోతే ఆయన పాత్ర పరిధి తక్కువగా అనిపిస్తుంది. హిజ్రాలకు ప్రయారిటీ ఇచ్చే క్రమంలో రక్షిత్ పాత్రకి ప్రయారిటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది. నిడివి కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఉన్న సీన్లలో మాత్రం అదరగొట్టారు. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ఇక ఎమ్మెల్యే పాత్రలో చరణ్ రాజ్ బలమైన పాత్ర పోషించారు. ఆయన గతంలో నటించిన పాత్రలకు భిన్నంగా, కొత్తగా ఉంటుంది. పూర్తి పాజిటివ్ రోల్. అదే సమయంలో ఓ వైపు కొడుకుని కాపాడుకోవడం కోసం, మరోవైపు పెంచిన కొడుకులాంటి శివ మధ్య నలిగిపోయే పాత్రలో ఆయన నెక్ట్స్ లెవల్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారు. సినిమాకి ఆయన పాత్ర మెయిన్ పిల్లర్‌లా నిలుస్తుంది. దీనికితోడు ఎస్టేజ్ సూపర్ వైజర్‌గా నాజర్ కొత్త తరహా పాత్ర పోషించారు. ఎస్‌ఐగా శ్రీమాన్, శివ భార్య మీనాక్షిగా అపర్ణ జనార్థన్, మరదలుగా సంకీర్తన విపిన్ ల నటన బాగుంది. మీనాక్షి చాలా అందంగా ఉంది. చరణ్ రాజ్ కుమారుడు తేజ్ చరణ్‌రాజ్ కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు హిజ్రాగా శత్రు కొత్తగా కనిపించి మెప్పించారు. ఫిష్ వెంకట్ నవ్వులు పూయించారు.
టెక్నీకల్‌గాః
నాని చమిడిశెట్టి కెమెరా వర్క్ బాగుంది. ఏఐఎస్ నవఫాల్ రాజా మ్యూజిక్ హైలైట్. పాటలు, బీజీఎం అదిరిపోయ్యింది. సినిమాకి మరో పిల్లర్ లా నిలిచింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కి కొదవలేదు. రిచ్‌గా చేశారు. దర్శకుడు సెబాస్టియన్ సినిమాని కథలేకుండా చేశాడా? అనిపిస్తుంది. కొన్ని సీన్లు రాసుకుని ప్రారంభం, ఎండింగ్ పెట్టినట్టుగా ఉంది. బలమైన కథని ఎంచుకోవడం ఆయన విఫలమయ్యాడు. దీంతో కొన్ని సీన్లు బాగున్నా, సినిమాపై ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి. యాక్షన్ సీన్లు, హిజ్రాల సీన్లు, లవ్ సీన్లు బాగున్నాయి. దీనికితోడు చరణ్ రాజ్ సీన్లని బలంగా రాసుకున్నారు. కథని రాసుకోలేకపోయాడు. ఆ విషయంలో మరింత కేర్ తీసుకుంటే సినిమా అదిరిపోయేది.
ఫైనల్‌గాః `నరకాసుర` కొంత వరకు మెప్పించే చిత్రం.
రేటింగ్‌ః 2.5
నటీనటులు : రక్షిత్, అపర్ణ జనార్థన్, నాజర్, సంగీర్తన, చరణ్ రాజ్, ఎస్.ఎస్.కాంచి, శ్రీమన్, ఫిష్ వెంకట్ తదితరులు.
దర్శకత్వం : సెబాస్టియన్ నోవా అకోస్టా
నిర్మాత : డా.అజ్జా శ్రీనివాస్
సంగీతం : నౌపాల్ రాజా
సినిమాటోగ్రాఫర్ : నాని చామిడి శెట్టి
ఎడిటింగ్ : సీ.హెచ్. వంశీ కృష్ణ