- Home
- Entertainment
- Movie Reviews
- `ఒక బృందావనం` మూవీ రివ్యూ, రేటింగ్.. ముగ్గురి ప్రయాణం లక్ష్యం చేరిందా?
`ఒక బృందావనం` మూవీ రివ్యూ, రేటింగ్.. ముగ్గురి ప్రయాణం లక్ష్యం చేరిందా?
బాలు, షిన్నోవా, సాన్విత ప్రధాన పాత్రల్లో, సత్య బొత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఒక బృందావనం`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`ఒక బృందావనం` మూవీ రివ్యూ
కొత్త నటీనటులతో వచ్చిన లేటెస్ట్ మూవీ `ఒక బృందావనం`. ఇందులో బాలు, షిన్నోవా, సాన్విత ప్రధాన పాత్రలు పోషించారు. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీరాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశీ నెక్కంటి ఇతరకీలక పాత్రలు పోషించారు. సత్య బొత్స దర్శకత్వంలో సీర్ స్టూడియోస్ పతాకంపై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందువూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం (మే 23న) ఈ మూవీ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`ఒక బృందావనం` మూవీ స్టోరీ ఏంటంటే?
రాజా విక్రమ్(బాలు)కి ఇంట్లో అన్నీ కష్టాలే. కెమెరామెన్‌గా ఒక ఈవెంట్ కంపెనీలో చేస్తుంటాడు. అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. మహ(షిన్నోవా) తన అమ్మ చనిపోవడంతో ఆమె చేయాలనుకున్న డాక్యుమెంటరీని కంప్లీట్ చేయాలని భావిస్తుంది.
ఇంట్లోవాళ్లు ఆమెకి మ్యారేజ్ చేయాలని ప్రయత్నిస్తుండగా, వారిని కాదని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. నైనికా(సాన్విత) ఒక అనాథాశ్రమంలో ఉంటుంది. ఆ పాపకి పేరెంట్స్ ఎవరో తెలియదు. కానీ జోసెఫ్(శుభలేఖ సుధాకర్) పేరుతో ఆమెకి క్రిస్మస్ గిఫ్ట్స్ వస్తుంటాయి.
దీంతో ఎప్పటికైనా ఆ జోసెఫ్ ని కలవాలని, తమ పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని ఆ పాప భావిస్తుంటుంది. రాజా లవ్ ఫెయిల్యూర్. ఆ బాధలో ఉన్నప్పుడు ఆయన కెమెరా స్టిల్స్ నచ్చి తన డాక్యుమెంటరీకి కెమెరామెన్‌గా చేయాలని కోరుతుంది మహ. డబ్బుల కోసం రాజా ఓకే చెబుతాడు.
వీరిద్దరు కలిసి ప్రయాణించే క్రమంలో అనాథాశ్రమం నుంచి పారిపోతూ నైనిక వీరి కంటపడుతుంది. జోసెఫ్ వద్దకు ఆమెని తీసుకెళ్తామని రాజా, మహ చెప్పడంతో వారితోపాటు డాక్యుమెంటరీ చేసేందుకు ఒప్పుకుంటుంది నైనిక. దీంతో ఈ ముగ్గురు కలిసి తమ లక్ష్యాల కోసం జర్నీ చేస్తారు.
మరి మహ డాక్యుమెంటరీ కంప్లీట్ చేసిందా? ఇంతకి ఆమె దేని గురించి ఆ డాక్యుమెంటరీ చేసింది? రాజా ఫారెన్ వెళ్లాలనే కోరిక నెరవేరిందా? నైనికా.. జోసెఫ్‌ని కలిసిందా? వీరి ముగ్గురు ప్రయాణం ఏ తీరం చేరిందనేది మిగిలిన కథ.
`ఒక బృందావనం` మూవీ విశ్లేషణ
ఒక జర్నీ ప్రధానంగా, అన్వేషణ ప్రధానంగా సాగే చిత్రాలు ఒక కొత్త తరహా ఫీలింగ్‌ని కలిగిస్తాయి. మనసుకి ఉల్లాసాన్నిస్తాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందులో ఒక సోల్ ఉంటుంది. అంతర్లీనంగా ఒక ఎమోషన్ ఉంటుంది. నవ్విస్తాయి, హాయి ఫీలింగ్ నిస్తాయి. ఆలోచింప చేస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. అంతిమంగా హృదయాన్ని టచ్ చేస్తూ ముగుస్తాయి. చాలా సేపు మనల్ని ఆ సన్నివేశాలు వెంటాడుతుంటాయి.
ఆ కోవకు చెందిన సినిమానే `ఒక బృందావనం`. మూడు పాత్ర జర్నీ, ఆ పాత్రల వెనుక కథ, అది రివీల్ అయిన తీరు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇందులో రాజా, మహి, నైనిక పాత్రల జర్నీ అలాంటి ఎమోషన్స్ తో సాగుతుంది. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
అయితే రాజా, మహ, నైనిక పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు. దీంతో అది సాగదీసినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంటరీ కోసం వారు చేసే జర్నీ కూడా స్లోగానే సాగుతుంది. కాకపోతే అందులోనూ ఎమోషన్స్ కి, ఫీల్ గుడ్ అంశాలకు ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఇంటర్వెల్‌లో మాత్రం మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిన తీరు బాగుంది.
`ఒక బృందావనం` మూవీ హైలైట్స్, మైనస్‌లు
సెకండాఫ్‌లో జోసెఫ్‌ని వెతుక్కుంటూ రాజా, మహ, నైనికా చేసే జర్నీ బాగుంది. అదే సమయంలో మరోసారి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అందులో మరింత ఫన్ మూమెంట్స్ పెట్టి ఉంటే బాగుండేది. అయితే ఎలాంటి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు కలవడం, పాప కోసం రాజా, మహి జర్నీ చేయడం కొత్తగా ఉంటుంది.
మరోవైపు రాజా లవ్ ఎపిసోడ్ రొటీన్‌గా ఉంటుంది. అదే సమయంలో మహ పాత్ర ద్వారా మహిళా సాధికారత అంశాన్ని టచ్ చేసిన తీరు బాగుంది. దాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించడం విశేషం. ఇక సెకండాఫ్‌లో ఫ్లాష్ బాక్ సీన్లు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే లవ్, ఎమోషనల్ సీన్లు, దీనికితోడు ఫ్యామిలీ ఎమోషన్స్ ని మేళవించిన తీరు బాగుంది.
క్లైమాక్స్ లో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, గుండెని బరువెక్కించేలా సాగుతుంది. ఆయా సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి. అయితే స్లో నెరేషన్, రొటీన్ సీన్లు ఇబ్బంది పెట్టినా, సింపుల్ స్టోరీతో, సింపుల్ నెరేషన్‌తో సాగే ఈ మూవీ మనసుకి ఒక హాయి ఫీలింగ్‌ని ఇస్తుందని చెప్పొచ్చు. ఫ్యామిలీతో చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ కావడం విశేషం.
`ఒక బృందావనం` మూవీ నటీనటుల ప్రదర్శన
రాజా పాత్రలో బాలు బాగా చేశాడు. కెమెరామెన్ పాత్రకి బాగా సెట్ అయ్యాడు. ఆయా పాత్రకి ప్రాణం పోశాడు. ఆయన పాత్ర రియాలిటీకి దగ్గరగా ఉండటం, తను కూడా అంతే సహజంగా చేయడం విశేషం. ఇక మహ పాత్రలో షిన్నోవా బాగా చేసింది. ఆమె పాత్రలోని మెచ్యూరిటీ ఆకట్టుకుంటుంది. తనుకూడా అంతే హుందాగా, బాధ్యతాయుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
బాల నటి సాన్విత క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంది. మెహబూబ్ బాషా, శివాజీ రాజా, శుభలేఖ సుధాకర్, రూపా లక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయి చేశారు. సినిమాకి అసెట్‌గా నిలిచారు.
`ఒక బృందావనం` మూవీ టెక్నీషియన్ల పనితీరు
సినిమాకి కెమెరా వర్క్ హైలైట్. గ్రీనరీ విజువల్స్ మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కేరళాలో చిత్రీకరించడంతో అక్కడి ప్రకృతి అందాలు ఎంతగానో కట్టిపడేస్తాయి. కెమెరామెన్ కూడా అంతే బాగా ఆయా విజువల్స్ ని కాప్చర్ చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. కథకి తగ్గట్టుగా బీజీఎం సాగింది. పాటల అలరిస్తాయి.
దర్శకుడు రొటీన్ కథనే రాసుకున్నా, సినిమాని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింప చేస్తాయి. దర్శకుడు మంచి ఫీల్‌గుడ్ మూవీని అందించారు. స్లోగా సాగే సీన్ల విషయంలో ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు.
ఫైనల్‌గాః టైటిల్‌కి తగ్గట్టుగానే ఒక మంచి బృందావనం లాంటి మూవీ ఇది. ఇంటిళ్లిపాది చూడదగ్గ మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. విజువల్స్ స్పెషల్ ఎట్రాక్షన్.
రేటింగ్‌ః 2.75