కనుబొమ్మలు మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది ఒత్తైన కనుబొమ్మల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కనుబొమ్మలు ఉన్నవి మనం అందంగా కనిపించడానికి, మన ముఖానికి ఒక రూపాన్ని ఇవ్వడానికే ఉన్నాయని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ కనుబొమ్మలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది కనుబొమ్మల గురించి పూర్తిగా కాదు.. సగం కూడా తెలియదు. అందుకే ఈ రోజు కనుబొమ్మల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.
కనుబొమ్మలు కళ్లను రక్షిస్తాయి
కనుబొమ్మల ప్రధాన విధుల్లో కళ్లను రక్షించడం ఒకటి. నీరు, చెమట, దుమ్ము వంటివి మన కళ్ళలోకి రాకుండా నిరోధించడానికి ఇవి సహాయపడతాయి. అంటే ఇవి సహజ అవరోధంగా పనిచేస్తాయన్న మాట. అలాగే మన కంటిచూపును స్పష్టంగా ఉంచి కళ్లను రక్షిస్తాయి.
ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైనవే
మన వేలిముద్రల మాదిరిగానే.. ఏ రెండు జతల కనుబొమ్మలు సరిగ్గా ఒకేలా ఉండవు తెలుసా? కనుబొమ్మల మందం, ఆకారం, వంపు ప్రతి వ్యక్తికీ మారుతాయి. అందుకే వీటిని కూడా ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
కనుబొమ్మలకు ఆయుష్షు
కనుబొమ్మలకు ఆయుష్షు కూడానా అని అనిపిస్తుంది కదా. కానీ కనుబొమ్మ వెంట్రుకలు కూడా ఒక నిర్ధిష్ట సమయానికి రాలుతాయి. అదే ప్లేస్ లో కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. కనుబొమ్మల వెంట్రుకలు సుమారుగా 4 నెలల పాటు జీవిస్తాయి. ఈ నిరంతర చక్రం మన కనుబొమ్మలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ముఖకవళికలో కీలకపాత్ర
మీరెప్పుడైనా గమనించారా? మన కనుబొమ్మలు కూడా ముఖ కవళికలలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కోపం, ఆనందం, ఆశ్చర్యం, విచారం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలను ఇవి చాలా సులువుగా తెలియజేస్తాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మనం ఈ భావాలను వ్యక్తపరచొచ్చు. అవతలి వారు కూడా సులువుగా మనం ఏ మూడ్ లో ఉన్నామో తెలుసుకుంటారు.
పెరిగే స్వభావం
తాకకుండా కనుబొమ్మలను అలాగే వదిలేస్తే అవి మన ముఖం బయటి అంచుల వైపు పెరిగే అవకాశం ఉంది. అందుకే కనుబొమ్మలను నీట్ గా, మంచి ఆకారంలో ఉంచడానికి రెగ్యులర్ గా అలంకరణ, మెయింటెనెన్స్ చేయాలి.
నెమ్మదిగా పెరగడం
మన తలపై ఉన్న వెంట్రుకలు నెలకు 0.5 అంగుళాల చొప్పున పెరుగుతాయి. కానీ మన కనుబొమ్మలు మాత్రం చాలా నెమ్మదిగా పెరుగుతాయి తెలుసా? అంటే ఇవి నెలకు 0.16 అంగుళాలు మాత్రమే పెరుగుతాయి. అందుకే వీటిని తరచుగా కట్ చేయకూడదు.
వయస్సుతో పాటు మార్పు
వయసు పెరిగే కొద్దీ మన కనుబొమ్మలు పల్చగా, సన్నగా అవుతాయి. వృద్ధాప్య ప్రక్రియలో ఇలా కావడం సర్వ సాధారణం. అలాగే రక్తప్రసరణ తగ్గడం, హార్మోన్ల మార్పులు, సహజంగా జుట్టు రాలడం వంటి కారణాల వల్ల కూడా కనుబొమ్మల జుట్టు రాలుతుంది.
కనుబొమ్మలకు సాంస్కృతిక ప్రాముఖ్యత
అవును వేర్వేరు సంస్కృతులల్లో కనుబొమ్మలు వేర్వేరు అర్ధాలు, చిహ్నాలను కలిగి ఉంటాయి. అంటే పురాతన ఈజిప్టులో కనుబొమ్మలను అందం, తెలివితేటలకు సంకేతంగా భావించారు. అయితే పాశ్చాత్య సంస్కృతులలో ఇవి అలంకరణగా పరిగణించబడుతున్నాయి.
అనారోగ్య సమస్యలకు ప్రభావితం
హైపోథైరాయిడిజం, అలోపేసియా, ట్రైకోటిల్లోమానియా వంటి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కనుబొమ్మల జుట్టు రాలుతుంది. లేదా పల్చగా అవుతుంది. మీ కనుబొమ్మల ఆకృతిలో మార్పు ఎక్కువగా కనిపిస్తే హాస్పటల్ కు వెళ్లడం మర్చిపోకండి.