గుంటూరు మహిళపై గ్యాంగ్ రేప్ దారుణం...బాధితులతో పోలీసుల తీరు మరీ ఘోరం: లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Sep 9, 2021, 10:07 AM IST
Highlights

గుంటూరు జిల్లాలో వివాహితపై బుధవారం రాత్రి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం దారుణమయితే... అదే రాత్రి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మరీ ఘోరమని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి: బుధవారం రాత్రి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసు స్టేషన్ పరిధిలో వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. భర్తను చితకబాది వివాహితపై దుండగులు అత్యాచారానికి పాల్పడటమే దారుణమయితే... ఫిర్యాదు చేయడానికి వెళితే స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఘోరమని లోకేష్ అన్నారు.   

''జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రాష్ట్రంలో మహిళల భద్రత పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరం. గుంటూరు నుండి బైక్ పై సత్తెనపల్లి వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది'' అన్నారు. 

''ఫిర్యాదు చెయ్యడానికి వెళితే ఘటన జరిగిన ప్రాంతం మా లిమిట్స్ లోకి రాదు... వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అని బాధితులతో పోలీసులు చెప్పడం ఇంకా ఘోరం. రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు'' అని లోకేష్ మండిపడ్డారు. 

'' ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా నన్ను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకి జగన్ రెడ్డి వాడుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి'' అని లోకేష్ అన్నారు. 

read more  నర్సరావుపేటలో లోకేష్‌ పర్యటనకు అనుమతి నిరాకరణ.. పోలీసులపై టీడీపీ నేతల విమర్శలు

బుధవారం రాత్రి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ వివాహితపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలను అడ్డుకున్న దుండగులు భర్తను కొట్టి మహిళలను పొలాల్లోకి లాక్కెల్లారు. అక్కడ దుండగులంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  

అయితే అదే రాత్రి బాధితులు ఈ దారుణంపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదంటూ బాధితుల నుండి ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో బాధితులు వెనుదిరిగి ఇవాళ ఉదయం మేడికొండూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
 
ఇక ''దిశ చట్టంతో ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడింది అంటూ ఆడబిడ్డల్ని మోసం చేసారు మహిళా హోంమంత్రి. దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ముందా వైఎస్ జగన్ గారు?'' అంటూ లోకేష్ ఇదివరకే సవాల్ విసిరారు. 
 
''ఇంకా 3 రోజులే మిగిలాయి... దళిత బిడ్డ రమ్యని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన వాడికి ఉరి వేసేది ఎప్పుడు? దిశ చట్టానికి ప్రచారం అంటూ సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని కొట్టేసిన 30 కోట్లు పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం వినియోగించి ఉంటే పరిస్థితి కొంతయినా మెరుగుపడేది సీఎం గారు'' అని లోకేష్ పేర్కొన్నారు. 

click me!