గోళ్లు అందంగా కనిపించాలని చాలా మంది మేనిక్యూర్, పెడిక్యూర్ చేయిస్తూ ఉంటారు. వాటి అవసరం లేకపోయినా.. గోళ్లను ఆరోగ్యం ఉంచుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా…

అందమైన రంగురంగుల గోళ్ళు ఎవరికి ఇష్టం ఉండవు? కానీ, గోళ్ళు పెరగగానే విరిగిపోతాయి. గోళ్ళ అందం అలంకరణలో భాగం మాత్రమే కాదు, ఆరోగ్య సంకేతం కూడా. కాలుష్యం, రసాయనాల వాడకం, ఎక్కువగా మేనిక్యూర్ చేయించుకోవడం, పోషకాహార లోపం వల్ల గోళ్ళు పెళుసుగా, పసుపు రంగులోకి మారి, ఇన్ఫెక్షన్స్ కి గురవుతాయి. మరి ఇలాంటప్పుడు గోళ్ళని ఎలా అలంకరించుకోవాలి?

పార్లర్ కి వెళ్లి డబ్బు ఖర్చు పెట్టి మేనిక్యూర్ చేయించుకోవడం తాత్కాలికం. శరీరానికి లోపలి నుంచి పోషణ అందించాలి. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే గోళ్ళు మళ్ళీ గట్టిగా, మెరుస్తూ ఉంటాయి.

1. నిమ్మరసం

గోళ్ళు త్వరగా పెరగడానికి నిమ్మరసం చాలా మంచిది. ఒక నిమ్మకాయ ముక్క తీసుకుని రోజుకి ఒక్కసారైనా ఐదు నిమిషాలు చేతులు, కాళ్ళ గోళ్ళ మీద రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి గోళ్ళు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. బాక్టీరియాను నివారించి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

2. కొబ్బరి నూనె

రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో చేతులు, కాళ్ళ గోళ్ళ మీద మసాజ్ చేయండి. కొబ్బరి నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది, ఇది ఒక మంచి యాంటీఆక్సిడెంట్.

3. బయోటిన్ అధికంగా ఉండే ఆహారం

గోళ్ళు, జుట్టు పెరుగుదలకు బయోటిన్ చాలా మంచిది. బయోటిన్ సప్లిమెంట్స్ లేదా బయోటిన్ అధికంగా ఉండే ఆహారం, అరటిపండ్లు, ఆవకాడో వంటివి తీసుకోవచ్చు. దీనివల్ల గోళ్ళు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండి త్వరగా పెరుగుతాయి. అయితే, బయోటిన్ తీసుకునే ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

4. గుడ్డు పెంకులు

గుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం గోళ్ళని గట్టిపరుస్తుంది. గుడ్డు పెంకులను ఎండలో ఆరబెట్టి పొడి చేయండి. కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి గోళ్ళ మీద పూసి పది నిమిషాలు ఉంచండి. దీనివల్ల గోళ్ళు గట్టిపడి, త్వరగా పెరుగుతాయి.

కొన్ని సూచనలు

* ఎప్పుడూ నెయిల్ పాలిష్ లేదా రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ వాడకండి.

* సరైన ఆహారం తీసుకుని, నీళ్ళు ఎక్కువగా తాగండి.

* గోళ్ళు కొరకడం అలవాటుంటే మానేయండి.

* డిటర్జెంట్, క్షార గుణాలున్న సబ్బులు వాడేటప్పుడు గ్లౌజులు వేసుకోండి.

* ప్రతిరోజూ గోళ్ళ మీద, చుట్టూ మాయిశ్చరైజర్ రాసుకోండి.