పనిమనిషికి పెళ్లి కుదిరి వెళ్లి పోతుండడంతో  ఓ ఇంటి యజమానురాలు కన్నీటి వీడ్కోలు చెప్పిన సంఘటన హృదయాన్ని తాకుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నారు కాబట్టి ఇంటి పనిమనిషిని పెట్టుకోవడం సర్వసాధారణం. కొంతమంది ఇంటి పనులు, ఆఫీస్ పనులు రెండూ చూసుకుంటారు. కానీ, చాలామందికి ఇంటి పనిమనిషి అవసరం. ధనికులు, వృద్ధులు... ఇలా ఎవరైనా సరే, ఇంటి పనిమనుషులకు డిమాండ్ బాగానే ఉంది. కానీ, చాలా ఇళ్లల్లో వారిని కేవలం పనిమనుషులుగానే చూస్తారు. వారిని కుటుంబ సభ్యులుగా చూసేవారు చాలా తక్కువ. వారిని తిట్టడం, ఇంట్లో ఏదైనా పోతే వారి మీదనే అనుమానపడటం, ఏదైనా కారణంతో సెలవు అడిగితే ఇవ్వకపోవడం, మిగిలిన అన్నం, కూరలు ఇవ్వడం, ఇంటి మూలన కూర్చోబెట్టి భోజనం పెట్టడం... ఇలాంటివి చాలా ఇళ్లల్లో జరుగుతుంటాయి. ఇంటి పనిమనుషులు కూడా వీటికి అలవాటు పడిపోయారు.

ఇంటి పనులన్నీ చేసే పనిమనిషి ఒక్కరోజు రాలేకపోతే ఇంట్లో ఎంత గందరగోళం అవుతుందో అందరికీ తెలుసు. ఆమె సెలవు పెడితే లేదా పని మానేస్తే ఇంటివారికి, ముఖ్యంగా ఇంటి పనులు చూసుకునే మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని ధనిక కుటుంబాల్లో పిల్లలకు ఆమే తల్లి, ఆమే అమ్మమ్మ, ఆమే అన్నీ. సొంత తల్లి ముఖం చూడని పిల్లలు ఇంటి పనిమనిషి ప్రేమలోనే పెరుగుతుంటారు. ఇవన్నీ తెలిసినా, చాలామంది ఆమెను కేవలం పనిమనిషిగానే చూస్తారు.

పనిమనిషికి కూడా కుటుంబ సభ్యురాలిగా…

కొన్ని సినిమాల్లో,సీరియల్స్ లో పని మనుషులను కూడా ఇంటి మనుషుల్లానే ఉంటారు. నిజ జీవితంలో అలా ఉంటారా..అనే అనుమానాలు కూడా వస్తుంటాయి.కానీ, అందరూ అలా ఉండరు కదా. ఇంటి పనిమనిషికి కూడా కుటుంబ సభ్యురాలిగా గౌరవం ఇచ్చేవారు ఉన్నారు. ఆమె బాధను, ఆమె సంతోషాన్ని పంచుకునేవారు ఉన్నారు.

అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరికీ కళ్ళు తెరిపించే వీడియో ఇది. ఇందులో, ఇంటి పనిమనిషికి పెళ్లి కుదిరింది. ఆమె ఇక పనికి రాదని చెప్పినప్పుడు, ఇంటి యజమానురాలు ఆమెకు హృదయపూర్వక కన్నీటి వీడ్కోలు చెప్పింది. ఆమెను సొంత కూతురిలా చూసుకుంది. ఆమె ఇక పనికి రాదని తెలిసి ఇంటి పిల్లలు బాధపడుతున్నారు. ఇలాంటి హృదయపూర్వక వీడియో చూసిన తర్వాత, ఇలాంటి యజమానులు కూడా ఉంటారని చాలామందికి అర్థమైంది.