ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నందిగ్రామ్‌లో తనకు సాయం చేయాలంటూ సీఎం మమత బెనర్జీ బీజేపీ నేతకు ఫోన్ చేశారంటూ చెబుతున్న ఆడియో టేప్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. అయితే భారతీయ జనతా పార్టీకి కౌంటర్‌గా ఆడియో టేప్‌ను విడుదల చేసింది టీఎంసీ. బీజేపీ సీనియర్ నేత ముకల్ రాయ్- శిశిర్ బజోరియాల మధ్య ఫోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది.
 

Also Read:నందిగ్రామ్ బిజెపి నేతకు మమత ఫోన్ కాల్ సంచలనం: ఆడియో వైరల్

ఈసీని ఏ రకంగా ప్రభావితం చేయవచ్చో శిశిర్ బజోరియాకు ముకుల్ రాయ్ వివరించారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్‌లో వివరించిన విధంగానే ఈసీ స్పందించిందని టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. 

ఇటీవలే టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సువేందు.. తాను నందిగ్రామ్ నుంచి పోటీచేసి, మమతపై 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు. అంతేకాదు, దీదీపై గెలవలేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు.

అటు మమతను ఓడించేందుకు బీజేపీ సువేందుకు అన్ని రకాల అండదండలు అందిస్తోంది. దీంతో నందిగ్రామ్‌లో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం బెంగాల్‌తో పాటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.