Asianet News TeluguAsianet News Telugu

నందిగ్రామ్‌ తీర్పును గౌరవిస్తా, ఈసీపై సుప్రీంకు వెళ్తా: మమత

బెంగాల్‌లో  టీఎంసీ గెలుపు ఈ దేశ ప్రజల విజయమని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. 
 

Mamata Benerjee reacts on west bengal election results lns
Author
New Delhi, First Published May 2, 2021, 6:38 PM IST

కోల్‌కత్తా: బెంగాల్‌లో  టీఎంసీ గెలుపు ఈ దేశ ప్రజల విజయమని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఆదివారం నాడు బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడారు. తాను నందిగ్రామ్‌లో ఓడినా 221 సీట్లు గెలుచుకొన్నట్టుగా ఆమె చెప్పారు. భారత్ ను బెంగాల్ ప్రజలు రక్షించారన్నారు. నందిగ్రామ్ లో ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నట్టుగా చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధిలా ఎన్నికల కమిషన్ (ఈసీ) పనిచేసిందని ఆమె మండిపడ్డారు. ఈసీపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆమె చెప్పారు.

also read:ధన్యవాదాలు, మాస్క్ లు పెట్టుకోండి, గుమికూడకండి: మమత బెనర్జీ

ఈ విజయం బెంగాల్ ప్రజల విజయంతో పాటు ప్రజాస్వామ్య విజయంగా ఆమె అభివర్ణించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కరోనాను అరికట్టే చర్యలపై నిర్ణయం తీసుకొంటామన్నారు. సీఎంగా తానే ప్రమాణం చేస్తానని ఆమె చెప్పారు. త్వరలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేసే తేదీని ప్రకటించనున్నట్టుగా ఆమె తెలిపారు.  

కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 

మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios