తృణమూల్ కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. నందిగ్రామ్‌లో తమ అభ్యర్ధుల గెలుపుకు సహకరించాలని మమత కోరారని.. బీజేపీ నేతలు ఆరోపించారు.

సీఎం తనతో మాట్లాడిన ఫోన్ కాల్ అంటూ ఆడియో క్లిప్ విడుదల చేశారు. ఆ ఆడియో టేప్ ఇప్పుడు బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోంది. కాసేపట్లో మమతా బెనర్జీ ఫోన్ కాల్ లీక్‌పై స్పందించనున్నారు టీఎంసీ నేతలు. 

అయితే మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ టీఎంసీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకుడైన సుబేందు అధికారికి నందిగ్రామ్‌ కంచుకోట. ఆయన ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.

అనంతరం మమతా ప్రస్తుత సిట్టింగ్‌ స్థానమైన భవానీపూర్‌ను కాదనుకొని నందిగ్రామ్‌లో పోటీచేస్తున్నారు. దీంతో నందిగ్రామ్‌లో ఇద్దరి మధ్య హోరాహోరి పోటీ నెలకొంది. 

మరోవైపు ఉద్రిక్తతల మధ్యే తొలి దశ పోలింగ్ సాగుతోంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా కేశీయారి ప్రాంతంలోని బీజేపీ కార్యకర్త మంగళ్ సురేన్ దారుణ హత్యకు గురయ్యారు. కుర్బామేదినిపూర్ జిల్లా సత్సతమల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి.

గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని ఓటర్లను అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.