ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ఘన విజయం సాధించిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌,  డీఎంకే అధినేత స్టాలిన్‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ఎన్నిక‌ల్లో విజయం సాధించిన మమతా దీదీకి అభినందనలు. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీని ఆశీర్వ‌దించిన వారికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

బెంగాల్‌లో బీజేపీ ఉనికి గ‌ణ‌నీయంగా పెరిగిందని మోడీ అన్నారు. బీజేపీ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని... ఎన్నికలలో ఉత్సాహంగా ప‌నిచేసిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అభినంద‌న‌లు తెలియజేశారు.

Also Read:నందిగ్రామ్‌: నాడు లెఫ్ట్‌ప్రంట్‌కు, నేడు సువేంద్‌పై మమత దెబ్బ

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కొవిడ్‌-19 మహమ్మారిని అధిగమించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మద్ధతు ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరోవైపు కేరళ అసెంబ్లీ ఎన్నికపై స్పందిస్తూ.. విజయం సాధించిన ఎల్‌డీఎఫ్‌ను, సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌కు ప్రధాని అభినంద‌నలు తెలిపారు.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిపై పోరాటంలో క‌లిసి ప‌ని చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో త‌మ పార్టీకి మద్దతు ఇచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అట్టడుగుస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డ కార్య‌క‌ర్త‌ల‌కు అభినందనలు తెలిపారు.