దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్‌లో జరగాల్సిన చివరి విడత పోలింగ్ ఒకే విడతలో జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మిగిలిన మూడు దశల ఎన్నికల పోలింగ్‌ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని బుధవారం స్పష్టం చేసింది.

మిగిలిన మూడు దశలను కలిపి ఒకేసారి నిర్వహించాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి మరోసారి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మూడు దశల పోలింగ్ యథాతథంగా, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పూ ఉండదని ఈసీ వెల్లడించింది.

Also Read:కమ్ముకొస్తున్న కరోనా: ఒకే విడతలో బెంగాల్ ఎన్నికలు, ఈసీ కీలక నిర్ణయం..?

అలాగే తృణమూల్ పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మిగిలిన మూడు దశల పోలింగ్‌ను కలిపి ఒకేసారి (ఒకేరోజు) నిర్వహించాలని తృణమూల్ ఈసీని కోరింది. 

కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రచార సమయాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కుదిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. మిగిలిన మూడు విడతలను ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29 న నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.