నందిగ్రామ్ పర్యటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎవ్వరూ దాడి చేయలేదని ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. ఆమెపై దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఈసీకి అందిన నివేదికలో వెల్లడైంది.

ఈ ఘటన ప్రమాదవశాత్తూనే జరిగిందని.. ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వివేక్ దూబే, అజయ్ నాయక్‌లు ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. మమత కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో ప్రస్తావించారు.

ఘటన జరిగిన సమయంలో ఆమె కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య వున్నారని నివేదికలో తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలాపన్ బందోపాధ్యాయ్ నుంచి పూర్తి వివరణ కోరింది ఈసీ.

Also Read:సేమ్ టు సేమ్: అప్పుడు జగన్, ఇప్పుడు మమతా బెనర్జీ

ప్రత్యేక పరిశీలకులు ఈసీకి తమ నివేదికను సమర్పించడానికి ముందే ఘటనా స్థలిని మరోసారి పరిశీలించారు. కారు డోరు తగలడం వల్లే మమత కాలికి గాయమైందని నివేదికలో స్పష్టం చేశారు చీఫ్ సెక్రటరీ.

కాగా, మార్చి 10వ తేదీన నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన మమతా బెనర్జీ తిరిగి కోల్‌కతా వస్తుండగా ఈ ఘటన జరిగింది. తనపై నలుగురైదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ మమత ఆరోపించారు.

కాలు వాచిందని.. ఛాతీలో నొప్పిగా వుందని చెప్పారు. నందిగ్రామ్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న దీదీ.. కోల్‌కతా చేరుకుని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆమెకు చికిత్స నందించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. చికిత్స అనంతరం మమత నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.