సేమ్ టు సేమ్: అప్పుడు జగన్, ఇప్పుడు మమతా బెనర్జీ
ఒకే ఫ్రేములో ఆసుపత్రి బెడ్ పై ఉన్న మమత, మరో పక్క కోడి కత్తి దాడి తరువాత ఆసుపత్రిలో ఉన్న జగన్ బొమ్మలను చేర్చి కింద ప్రశాంత్ కిషోర్ బొమ్మను ఉంచారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
నిన్న రాత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆమె కాలికి బలమైన గాయం అవడంతో ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. నందిగ్రామ్ లో నిన్న ఈ దాడి జరిగిన తరువాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది కూడా. తనపై బీజేపీకి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసారని మమతా బెనర్జీ చెబుతుండగా .... ఆమెపై ఎవరూ దాడి చేయలేదని, ఇదంతా పబ్లిసిటీ కోసమేనని బీజేపీ ఆరోపిస్తుంది.
బీజేపీ, టీఎంసీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే అధికంగా ఉన్న ఎమోషన్స్ ఈ సంఘటన తరువాత తారాస్థాయికి చేరుకున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో మమతాబెనర్జీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కి రెండంకెల కన్నా ఎక్కువ సీట్లు వస్తే తాను సోషల్ మీడియాను వాడనని సవాల్ విసిరాడు. అంతలా అక్కడ రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి కూడా ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది ప్రశాంత్ కిశోర్ అన్న విషయం విదితమే..!
ఇదే కామన్ లింక్ ని పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఒకే ఫ్రేములో ఆసుపత్రి బెడ్ పై ఉన్న మమత, మరో పక్క కోడి కత్తి దాడి తరువాత ఆసుపత్రిలో ఉన్న జగన్ బొమ్మలను చేర్చి కింద ప్రశాంత్ కిషోర్ బొమ్మను ఉంచారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ప్రశాంత్ కిషోర్ సలహా యేనా ఇది అని ఇప్పటికే బీజేపీ వర్గాలు ఆక్షేపిస్తున్న విషయం తెలిసిందే..!
దీదీ ఆరోపిస్తున్నట్టు ఈ దాడి బీజేపీ వాళ్ళు చేసారా, లేదా కాషాయ దండు ఆరోపిస్తున్నట్టు ఇదంతా డ్రామానా అనే విషయం పక్కనబెడితే.... ఆసుపత్రికి వెళ్ళాక జగన్ గెలిచాడు, ఇప్పుడు అలానే ఆసుపత్రికి వెళ్లి వచ్చాక మమత కూడా అలానే గెలుస్తుందా అనే చర్చ మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగిన తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్ అఖండమైన మెజారిటీ సాధించారు. ఇప్పుడు అనేక మంది అదే విషయాన్నీ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
జగన్ మాదిరే మమతాబెనర్జీ సైతం అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందా అని చర్చలు సాగుతున్నాయి. బీజేపీ వర్గాలు మాత్రం ఇదంతా డ్రామా అని కొట్టి పడేస్తున్నాయి. మమతాబెనర్జీని అసలు ఎవరూ నెట్టింది కూడా లేదని, దాడి అసలు జరగలేదని ఎన్నికల వేళ సింపతీ కోసం డ్రామాలాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలవేళ సెంటిమెంటుతో సీట్లను సాధించాలనే దురుద్దేశంతోనే మమత ఈ డ్రామాకు తెర తీసారని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు.
ఈ పరిస్థితులను చూస్తుంటే... ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే మాదిరి జరిగిన మరో అమషం కూడా గుర్తుకురాక మానదు. జగన్ మీద కోడి కత్తి దాడి జరిగినప్పుడు ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తే.... వారే దాడి చేపించుకొని సెంటిమెంటు ద్వారా ఓట్లు గడించాలని చూస్తున్నారని టీడీపీ ప్రత్యారోపణ చేసింది. ఆ కేసు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందనే విషయాన్నీ పక్కనబెడితే.... తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్ అఖండమైన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు బెంగాల్ లో సైతం ఇవే సీన్లు రిపీట్ అవుతున్నందున మమతా సైతం సెంటిమెంటు ప్రకారం విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి..!