ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు యాత్రకు వ్యతిరేకంగా పెద్దఎత్తున సాగుతున్న నిరసనల సెగ మాజీ మంత్రి, టిడిపిఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు తాకింది. చంద్రబాబు ఆహ్వానించడానికి వచ్చిన ఆయనను నిరసనకారులు విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకున్నారు. ‘గో బ్యాక్‌ చంద్రబాబు..ఉత్తరాంధ్ర ద్రోహి’ అంటూ నిరసన కారులు పెద్దఎత్తున నిరసన తెలిపారు.  

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఉత్తరాంధ్ర పర్యటనపై ఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు పర్యటనను ప్రజాసంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

బాబును ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్టు,ఎన్‌ఏడీ జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టులోకి పరిమిత సంఖ్యలో టీడీపీ నేతలకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

read more   విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

రెచ్చగొట్టే,మోసం చేసే పర్యటనలు చంద్రబాబు మానుకోవాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోపెట్టారన్నారు.

ఉత్తరాంధ్రకు ఏం చేశారని చంద్రబాబు పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళానేత కిల్లి కృపారాణి మండిపడ్డారు. చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్ర కాదని పశ్చాత్తాప యాత్ర అని ఆమె దుయ్యబట్టారు.విభజన తర్వాత చంద్రబాబు తీరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ సుపరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు.

read more  డిల్లీని తలపిస్తున్న ఏపి... అమరావతి గూండాలే విశాఖలో...: చినరాజప్ప

ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతే విశాఖలో అడుగుపెట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు సంఘీభావం తెలపాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే చంద్రబాబుకు అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.