అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పులివెందుల రాజకీయాలు ఆపేయాలని...  వాటిని మానుకోకపోతే తొందరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారని... దాన్ని అడ్డుకోవాలనుకుంటే ఆయన ఒక్కరోజు కూడా యాత్ర చేసి ఉండే వాడు కాదని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ఫలితాన్ని భవిష్యత్ లో అనుభవిస్తారని మండిపడ్డారు. 

గతంలో ల్యాండ్ పూలింగ్ విధానాన్నే వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు ఏ విధంగా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని నిలదీశారు.  భూములు కోల్పోయిన వారిని పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడు వెళుతుంటే జగన్ కు ఎందుకంత భయం? ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వైసీపీ గూండాలతో అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

read more  విశాఖలో ఉద్రిక్తత: పాదయాత్రను అడ్డుకొన్న పోలీసులు, కారులోనే బాబు

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఢిల్లీని తలపిస్తోందని అన్నారు. పేదల భూములను వైసీపీ ప్రభుత్వం లాక్కుంటున్న తీరు అప్రజాస్వామికమన్నారు. కొండలు, గుట్టలు, ముళ్ల కంపలను  తొలగించి సాగుకు అనుకూలంగా చేసుకుని ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను ఇళ్ల స్థలాల పేరిటి లాక్కుని పేదల పొట్ట కొట్టవద్దంటూ విశాఖకు వెళ్లడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. 

అమరావతిలో ప్రతిపక్ష నేతపై చెప్పులు విసిరిన గుండాలే ఇప్పుడు విశాఖలో కూడా ఆయన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలబడుతున్న చంద్రబాబుపై దాడిచేయడానికి వారు రాత్రికి రాత్రే కోడిగుడ్లు, టమాటాలను సమకూర్చుకున్నారని మండిపడ్డారు. పులివెందుల రాజకీయాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంను భయాబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు.