విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అమరావతితో పాటు మరో రెండు చోట్ల రాజధాని అంటే బహుళ రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో తామున్నామంటూ జగన్ పేర్కొన్నారు. దీంతో అమరాతి  ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు మొదలవగా మిగతాచోట్ల హర్షతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను పరిపాలనా రాజధానికి ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం జగన్ వుండటంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం  చేశారు. 

విశాఖ విమానాశ్రయంలో మంత్రి అవంతి కాస్సేపు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పైనా, వైసిపి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. శాసనసభలో మంగళవారం సీఎం చేసిన ప్రకటనతో రాజధాని అంశం జాతీయ స్థాయిలో ప్రధానంగా తెరపైకి వచ్చిందన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూలస్తంభంగా నిలుస్తోందని ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలు స్పష్టీకరిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

read more  కనెక్ట్‌ టు ఆంధ్రా సక్సెస్... చేయూతకు కార్పోరేట్ సంస్థల ఆసక్తి

బాగా అభివృద్ధి చెందిన విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా సరిగ్గా సరిపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలను, ప్రాంతాలను కులాల పేరుతో విభజించి చిచ్చుపెట్టడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు. 

వెనుకబడి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామమన్నారు. ఇక ఇప్పుడున్నట్లే శాసన రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. ఇలా మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తీసుకురావడంతో రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.

reaf more జైల్లో పెడతారనే ఆయన భయం... అందుకే అలా చేస్తున్నారు : కొడాలి నాని

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక రాగానే దాన్నిబాగా పరిశీలించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్‌ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు.  ముఖ్యమంత్రి జగన్ మాటలకు జనామోదం లభిస్తోందని  అవంతి తెలిపారు.