అమరావతి: కనెక్ట్ టు అంధ్రా కింద నాడు–నేడు కార్యక్రమానికి చేయూత అందించేందుకు ఐదు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్, రెయిన్‌ కార్బన్‌, లారస్‌ ల్యాబ్స్‌ సంస్థలు ప్రభుత్వ పిలుపుపై స్పందించాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ సంస్థలు ముందుకువచ్చాయి. 

పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఈ నాలుగు సంస్థలకు చెందిన ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 

402 ప్రభుత్వ పాఠశాల్లో నాడు –నేడు చేపట్టేందుకు హెటిరో సంస్థ ముందుకొచ్చింది. వైయస్సార్‌ కడప జిల్లాలోని చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లో స్కూళ్లను రూ. 20 కోట్లకుపైగా ఖర్చుతో ఈ సంస్థ అభివృద్ధిచేయనుంది. 

read more  జైల్లో పెడతారనే ఆయన భయం... అందుకే అలా చేస్తున్నారు : కొడాలి నాని

ఇక మరో ఫార్మా సంస్ధ వసుధ గ్రూప్ 428 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు చేపట్టనుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లో స్కూళ్లను ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది.  వసుధ ఫార్మా దాదాపు రూ.21 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. 

రెయిన్‌ కార్బన్‌ సంస్థ 66 స్కూళ్లను డెవలప్‌ చేయనున్నట్లు ప్రకటించింది.కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని స్కూళ్లను అభివృద్ధిచేయనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.  దాదాపు రూ. 1.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రెయిన్‌ కార్బన్‌  సంస్థ ప్రకటించింది. 

281 స్కూళ్లను అభివృద్ధి చేయనున్న ఆదిలీల ఫౌండేషన్‌ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకోసం ఆదిలీల ఫౌండేషన్‌ రూ. 25 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించింది.   

ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 359 స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది. ఇందుకోసం రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ 
కంచికచర్ల, వేలేరుపాడు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాల్లో స్కూళ్ల అభివృద్ధి  చేయనుంది. 

read more  రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు

ఇక నార్త్‌ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్‌ తన ఉదారతను చాటుకున్నాడు. తన తొలి జీతాన్ని ఈ నాడు-నేడు కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వ స్కూళ్లలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. నాడు – నేడు ద్వారా వాటిని అభివృద్ది  చేస్తున్నామని...అందుకోసం 45వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్ల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు ల్యాబ్, 9 రకాల సదుపాయలను కల్పిస్తున్నామన్నారు. ఇవి ఖచ్చితంగా ప్రతి స్కూళ్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను 1 నుంచి 6 వ తరగతి వరకూ వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడుతున్నామని.... ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామని వెల్లడించారు. 

అలాగే అమ్మ ఒడి ద్వారా పిల్లల తల్లులను ఆదుకుంటున్నామని అన్నారు. 2011 జనాభాల లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని...దీన్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ నాడు – నేడు కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాననని అన్నారు.

read more  రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక

అందరూ తలా ఒక చేయి వేయాల్సిన సమయమిదని... రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందన్నారు. అలాగని, దృష్టిపెట్టాల్సిన అంశాలను విస్మరించలేమని... ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై ఖచ్చితంగా దృష్టిపెట్టాల్సిందేనన్నారు. అందుకనే అందరి సహకారాన్ని కోరుతున్నామని... ఇప్పుడు చేస్తున్న సహాయం ఎక్కడా కూడా విస్మరించకుండా ఉంటుందన్నారు. సహాయం చేస్తున్నవారి పేర్లు కూడా పెడతామని జగన్ తెలిపారు.

కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ప్రణాళికాశాఖ డిప్యూటీ సెక్రటరీ, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, వసుధ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.వెంకట రామరాజు, లారస్‌ లాబ్స్‌ సీఈఓ చావా సత్యన్నారాయణ , హెటిరో డ్రగ్స్‌ ఎండీ వంశీకృష్ణ, సుధాకర్‌లు, రెయిన్‌ కార్భన్‌ సీజీఎం ఆదినారాయణస్వామి, సిఎఫ్‌ఎం జి.ఆర్‌.కుమార్‌లు, ఆదిలీల పౌండేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ పాల్గొన్నారు.