సీతక్కా.. ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలపై ప్రేమ చూపిస్తారా?: BRS MLC కల్వకుంట్ల కవిత

Share this Video

ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్‌ కాస్ట్‌ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రామప్ప రామలింగశ్వేరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కేసీఆర్‌ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆ ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ పేరుతో బొగ్గు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో బ్లాస్లింగులు జరిపితే ఆలయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయంపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఈ ఒక్క ప్రయత్నంతో తేలిపోతుందన్నారు. కేసీఆర్‌ ప్ర ప్రభుత్వంలోనే రామప్ప ఆలయానికి గుర్తింపు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అప్పుడు చిన్నపాటి పనులు పెండింగ్‌ లో ఉంటే ఏడాదిన్నరగా పట్టించుకోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇప్పుడు అందాల పోటీల కోసం పైపై మెరుగులు దిద్దుతున్నారన్నారు. ములుగు నియోజకవర్గంలో రైతులు, ప్రజలు చనిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీతక్కకు ప్రజలపై ప్రేమ ఉంటుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదా అని ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video