Asianet News TeluguAsianet News Telugu

diwali video : అమావాస్యనాడు వచ్చే వెలుగుల పండుగ

చీకటి వెలుగుల రంగేళీ దీపావళి. వెలుగు పూల కేళీ దీపావళి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండుగ దీపావళి. ఈ దీపావళినాడు రంగురంగుల రంగవళ్లులు, మట్టిప్రమిదలు, బొమ్మలకొలువులు, పూల తోరణాలు, తీపిపదార్థాలు, టపాసుల మోతలు...ఎన్నో ప్రత్యేకతలు.

చీకటి వెలుగుల రంగేళీ దీపావళి. వెలుగు పూల కేళీ దీపావళి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండుగ దీపావళి. ఈ దీపావళినాడు రంగురంగుల రంగవళ్లులు, మట్టిప్రమిదలు, బొమ్మలకొలువులు, పూల తోరణాలు, తీపిపదార్థాలు, టపాసుల మోతలు...ఎన్నో ప్రత్యేకతలు.

దీపం...తనకింద చీకట్లున్నా ప్రపంచాన్ని వెలుగులతో నింపే ఓ అద్భుతం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాల వరుసే దీపావళి. దీపావళినాడు మట్టిప్రమిదల్లో నూనెపోసి దీపాలు వెలిగించడం సంప్రదాయంతో పాటు ఆరోగ్యదాయకం కూడా. దీపం మనోవికాసానికి, ఆనందానికి, సంతోషానికి, విజయానికి, సంబురానికి, లక్ష్మీదేవికి ప్రతిరూపం. అమావాస్య చీకట్లను పారద్రోలే దీపావళినాడు లక్ష్మీదేవి పూజ చేసి అనేక దీపాలతో అలంకరించడం కూడా ఈ సంబురాల్లో ముఖ్య ఘట్టం. దీపానికున్న ఈ ప్రాశస్త్యాన్ని దృష్ట్యానే ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు.


దీపావళినాడు రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దడం ఆనవాయితీ. ముగ్గూ లక్ష్మీదేవి ప్రతిరూపమే. దేవుడి గదిలో, ఇంట్లో ఓ ప్రత్యేకమైన స్థలంలో రంగులతో అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది ఈ ముగ్గునిండా దీపాలతో అలంకరించడమూ కనిపిస్తుంది. 

దీపావళి గురించి చెప్పుకునేప్పుడు చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేక అంశం బొమ్మలకొలువు. రకరకాల బొమ్మలతో ఏర్పాటు చేసే బొమ్మలకొలువు చూడముచ్చటగా ఉంటుంది. యేటా ఓ కొత్త బొమ్మను చేరుస్తూ యేడాదికేడాది బొమ్మల కొలువును పెంచుతూ పోతారు. యేటా ఓ కొత్త దొంతుల జతను పెట్టడమూ ఆనవాయితే.

లక్ష్మీ పూజనాడు వ్యాపార సముదాయాల్లో, ఇళ్లలో గుమ్మడికాయలు కట్టడం ఆనవాయితీ. దీపావళి అంటే బంతిపూలకు భలే గిరాకీ. ఎటు చూసినా పసుపుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో బంతిపూల సోయగం, మత్తైన వాసన ఆకర్షిస్తుంది. దీపావళికే కొత్త అందాన్ని తీసుకువస్తుంది. 

ఇక దీపావళి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టపాసులు. సత్యభామ చేతిలో నరకాసురుడు హతమై, తమకు రాక్షసపీడ విరగడైన సంబురంలో ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. ఈ టపాసుల్లోనూ ఇప్పుడు ఎన్నో వెరైటీలు. దీపావళినాడు టపాకాయలు కాల్చడంలో మరో విశేషముంది. వర్షాకాలం తరువాత చలికాలం ప్రారంభంలో దీపావళి వస్తుంది. ఈ సమయంలో దోమలు, పురుగులు ఎక్కువగా ఉంటాయి. టపాసుల పొగ వీటిని పోగొడుతుంది. తద్వారా రోగాలనుండి రక్షిస్తుంది. టపాసులు కాల్చాక ఆ పొగవల్ల సైడ్ఎఫెక్ట్స్ రాకుండా తీపి తినాలనేది పెద్దలు చెప్పే మాట.

దివ్యకాంతుల దీపావళి కోటివెలుగులు పూయిస్తూ...సంపదని, సంతోషాన్నీ రెట్టింపు చేస్తూ...భవిష్యత్ ఆశల చిచ్చుబుడ్లను వెలిగిస్తూ...అందమైన జీవితపు రంగోళీతో... ప్రతి ఒక్కరి జీవితంలోనూ బంతిపూవులాంటి తాజాదనాన్ని తీసుకురావాలని ఆశిద్దాం.

Video Top Stories