Minister Gottipati Ravi Kumar : కరెంటు చార్జీలు పెంచింది వైసీపీయే.. అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి

Galam Venkata Rao  | Published: Mar 4, 2025, 5:00 PM IST

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీల‌ను ఇప్ప‌టివ‌ర‌కు పెంచ‌లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టంచేశారు. భవిష్యత్తులో కూడా పెంపు ఉండబోదని శాసన మండలి సాక్షిగా ప్రకటించారు. శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి స‌మాధానం ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంలో విద్యుత్ రంగాన్ని స‌ర్వనాశ‌నం చేసిందని చెప్పారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకు క‌నీసం మాట్లాడే అర్హ‌త కూడా లేద‌ని మండిపడ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం చివ‌రి రెండేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల‌పై రూ.15,000 కోట్ల విద్యుత్ భారం మోపింద‌ని వెల్ల‌డించారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి సుమారు రూ.8,113 కోట్ల‌కుపైగా విద్యుత్ ఛార్జీల‌ను పెంచి ఈఆర్సీకి పంపింద‌న్నారు. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా మ‌రో రూ.11,000 కోట్లు పెంపుపై ఈఆర్సీకి ప్ర‌తిపాద‌న‌లు పంపిన విష‌యాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తుచేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రక్రియ మూడు నెల‌ల్లో పూర్తి కావాల్సి ఉండగా, దానిని దాదాపు 20 నెల‌ల కాలానికి సాగ‌దీసింద‌ని తెలిపారు. వైసీపీ ప్ర‌భుత్వ‌ ప్ర‌తిపాద‌న‌ల‌తో పెరిగిన‌ రూ.15,000 కోట్ల‌ విద్యుత్ భారాన్ని కూట‌మి ప్ర‌భుత్వంపై మోపేలా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్నార‌ని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్లే రోడ్లెక్కి ధ‌ర్నాలు చేయ‌డం, ప్ర‌శ్న‌లు వేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

Read More...