చిత్తూరు: అధికార గర్వంతో వైఎస్సార్‌సిపి నాయకులు టిడిపి శ్రేణులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలా దాడులకు పాల్పడిన వారే తిరిగి పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

అధికారపార్టీ ఆదేశాలతో టిడిపి శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని... చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు ఆలా కొమ్ముకాయడం తగదన్నారు. తమ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. అంతేకాదు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పట్టిన గతే డిజిపికి కూడా పడుతుందని హెచ్చరించారు. 

డిజిపిని సీఎం జగన్ కూడా కాపాడలేరని అన్నారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకోబోమని...ఏం చేయాలో తమకు కూడా తెలుసని చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని టిడిపి శ్రేణులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భగా ఆయన తన స్నేహితుడు, అదే జిల్లాకు చెందిన దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ ను గుర్తుచేసుకున్నారు.  

అధికారంలోకి వచ్చాక సీఎం ఏదేదో చేయాలని చూశాడని...కానీ కొండను తవ్వి వెంట్రుక కూడా పీకలేకపోడన్నారు. వైసిపి నాయకులు మదమెక్కిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారన్నారన్నారు. పులివెందుల పంచాయితీ రాష్ట్రంలో కుదరదన్నారు. అలా చేస్తే ప్రజలు మళ్ళీ పులివెందులకే పంపించడం ఖాయమని హెచ్చరించారు.

 read more  ఇసుక ధరను నిర్ణయించే అధికారం వారికే... హద్దుదాటితే జైలే...: జగన్

ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు పాలించిన వారిలో అత్యంత చెత్త ముఖ్యమంత్రి జగనేనని విమర్శించారు. అతడో పనికిమాలిన సీఎం అని ద్వజమెత్తారు. అతడి అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారని అన్నారు. 

రాష్ట్ర ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వుండేందుకు దోమలపై మా ప్రభుత్వం యుద్దం చేస్తే ప్రస్తుతం దోమలను పెంచి పోషిస్తున్నారని అన్నారు. దీంతో ప్రతి ఇంట్లో జ్వరాలతో బాధపడేలా చేశారన్నారు. 

రాష్ట్రంలో ఇరిగేషన్ అభివృద్ది జరిగింది తమ ప్రభుత్వ హయాంలోనే అన్నారు. వరదలొస్తే విదేశాలకు వెళ్ళిపోతున్న సీఎంకు తన ఇల్లు ముంచాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదన్నారు. ఆఖరుకు తాను నివసించే ఇల్లు కూల్చలేకపోయారు కానీ లంక గ్రామాలను ముంచేశాడని మండిపడ్డారు.

read more  సొంత జిల్లాలో చంద్రబాబు బిజీబిజీ... మూడు రోజుల షెడ్యూల్ ఇదే

పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు వేయడం ఏంటని ప్రశ్నించారు.  తమ పార్టీ నాయకులు గెలిచిన చోట ఈ రంగు తీయిస్తామన్నారు. మీ ముఖాలకు రంగేస్తామంటూ వైసిపి నాయకులపై విరుచుకుపడ్డారు.పాలనపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి, చెడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో జగన్  పాలనే నిదర్శనమన్నారు. 

ప్రజలకు కావలసినవి అన్నీ చేశాం కానీ ప్రజలు ఏమి ఆలోచించారో తెలియడం లేదన్నారు. మేం సంపద సృష్టించి పేదలకిచ్చి అభివృద్ధి చేస్తే జగన్ ప్రభుత్వం పేదరికాన్ని పెంచుతోందన్నారు. ఏపి మరో బీహార్ గా మార్చబోతున్నారని అన్నారు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక కొండవీటి సింహాలుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అలా పోరాడితేనే ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని కాపాడుకోగలమని సూచించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టబోమన్నారు. 

చింతమనేనిపై కేసులు పెడుతున్న ప‌గో జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్న తీరు హేయంగా వుందన్నారు. మూడేళ్లతో సర్వీస్ ముగిసిపోదని ఎస్పీ గుర్తుంచుకోవాలన్నారు. బాబాయ్ హత్య కేసు ఏమైందో చెప్పలేని ముఖ్యమంత్రి ఇతరుల మీద కేసులు పెట్టిస్తున్నాడన్నారు. పోలీసు కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తే తిరుగుబాటుకు వెనకాడబోమన్నారు.  ఎన్నో సంక్షోభాలను చూశామని...ఎప్పుడూ అంతిమ విజయం టిడిపిదేనని అన్నారు.

 చిత్తూరు జిల్లాకు ఏమైనా మేలు జరిగిందంటే అది టిడిపి హయాంలోనే అని అన్నారు. ఐదు సంవత్సరాలు రాష్ర్టం కోసం కుటుంబాన్ని వదిలిపెట్డి కార్యకర్తలను కూడా పట్టించుకోలేకపోయానని అన్నారు. మళ్లీ అది జరగబోదన్నారు. మరో 30యేళ్ళకు అవసరమయ్యే నాయకత్వాన్ని తయారు చేయడానికి పార్టీ నిర్మాణం చేస్తానని చంద్రబాబు తెలిపారు. 

 పార్టీలో 33శాతం యువతకు,33 మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాయకత్వాన్ని అందుకోడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాటాకు చప్పుళ్ళకు బెదరేది లేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కన్నెర చేసి ఉంటే ఇప్పుడు ఎవరూ ఎగిరెగిరి పడేవారు కాదన్నారు. కేసులు పెట్టడం మగతనం కాదని...అలా చేసి బెదిరించాలనుకునేవారు మగాళ్ళే కాదన్నారు. 

read more  బదిలీ ఎఫెక్ట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం
 
14వ తారీఖున ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇసుక సమస్యపై నిరాహారదీక్ష చేయబోతున్నాని తెలిపారు. నీరు చెట్టు బిల్లులు ఆపి పులివెందుల పంచాయితీ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరబ్బ సొమ్మని ఈ బిల్లులు నిలిపారని...వులు మెలేసి వడ్డీతో సహా వసూలు చేస్తామని...ఎవరూ భయపడవద్దని చంద్రబాబు  అన్నారు.