తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Tirumala Laddu Quality : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ను ఏర్పాాటు చేస్తున్నారు.

తిరుమల లడ్డూ కల్తీకి చెక్...
Tirumala : తిరుమల కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా కొలుస్తుంటారు తెలుగు ప్రజలు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశవిదేశాల నుండి కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు... రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం స్వామిని దర్శించుకుని మైమరచిపోతారు. ఇంతటి పవిత్రమైన ఆలయ ప్రసాదం కల్తీ ఇటీవల తీవ్ర దుమారం రేపింది. తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీదని.. ప్రమాదకరమైన రసాయనాలే కాదు జంతువుల కొవ్వును ఇందులో వాడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి... లేదు లేదంటూ వైసిపి నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. వీరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం తిరుమల లడ్డూ నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదంలో కల్తీ వస్తువులు వాడకుండా కూటమి సర్కార్ సరికొత్త టెక్నాలజీని సిద్దంచేసింది. 'ఇ-నోస్', 'ఇ-టంగ్' వ్యవస్థతో కూడిన అత్యాధునిక ల్యాబ్ ను సిద్దంచేస్తోంది.
ఏమిటీ ఇ-నోస్, ఇ-టంగ్ టెక్నాలజీ..
సాధారణంగా అహార పదార్థాలు బాగున్నాయో లేవో వాసనను చూసి చెప్పవచ్చు... రుచిని టేస్ట్ చూసి చెప్పవచ్చు. ఇందుకు తగినట్లు మనిషి ముక్కు, నాలుక పనిచేస్తాయి. సేమ్ టు సేమ్ ఇలాగే సాంకేతికతను ఉపయోగించిన అహార పదార్థాల నాణ్యతను కనుగొనే విధానమే ఈ 'ఇ-నోస్', 'ఇ-టంగ్' వ్యవస్థ. దీని తిరుమల ప్రసాదంలో కల్తీ జరగకుండా ఉపయోగించనున్నారు.
'ఇ-నోస్' అనేది మనిషి ముక్కు మాదిరిగా అహార పదార్థాల నాణ్యతను వాసనను బట్టి గుర్తిస్తుంది. ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ ద్వారా ఇది పనిచేస్తుంది... ముందుగానే ప్రోగ్రామ్ చేసిన వాసనకు ఇది సరిపోతే అహారం నాణ్యతలో ఎలాంటి లోపం లేదని గుర్తిస్తుంది.
ఇ-టంగ్ అనేది మన నాలుకలో ఉన్న టేస్ట్ బడ్స్ మాదిరిగా పనిచేస్తాయి. అహారంలో తిపి, పులుపు వంటివి సరిపోయాయో లేదో ఇది తెలియజేస్తుంది... ఏదైనా తేడా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది.
ఇలా ఇ-నోస్, ఇ-టంగ్ ద్వారా క్షణాల్లో తిరుమలలో అహార పదార్థాల నాణ్యతను తెలుసుకోవచ్చు. తద్వారా కల్తీని నివారించి ప్రసాదం పవిత్రతను కాపాడవచ్చు. ఈ ఇ-నోస్, ఇ-టంగ్ పరికాలను ప్రాన్స్ నుండి తీసుకువచ్చినట్లు.. వీటికోసమే రూ.3 కోట్లపై పైగా ఖర్చు చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
తిరుమలలో అత్యాధునిక ల్యాబ్...
తిరుమల ప్రసాదంపై భక్తుల విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుందని... ఇందులో భాగంగానే రూ.25 కోట్లతో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అత్యాధునికి సాంకేతికతతో కూడిన ఈ ల్యాబ్ లో తిరుమల ప్రసాదంలో ఉపయోగించే ముడి పదార్థాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. నెయ్యి, బాదం, కిస్మిస్ దగ్గరనుండి చక్కెర, కారం వంటి వాటివరకు మొత్తం 60 రకాల పదార్థాలను ఈ ల్యాబ్ లో పరిశీలించాకే ప్రసాదం, ఇతర అహార పదార్థాల్లో ఉపయోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
2024 అక్టోబర్ 8న తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI (ఫుడ్ సెఫ్టీ ఆండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తో వైద్యారోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే రూ.23 కోట్లతో తిరుమలలో 12,000 చదరపు అడుగుల భవనం, అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 40 మందికి పైగా ఉద్యోగులు పనిచేయనున్నారని మంత్రి వెల్లడించారు.
దేశంలోనే మొదటి ల్యాబ్...
భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి... ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రసాదం అందిస్తారు. కానీ ఎక్కడా ప్రసాదం నాణ్యతను టెస్ట్ చేసేందుకు ప్రత్యేకమమైన ల్యాబ్ లేదు. దేశంలోనే మొదటిసారి తిరుమలలో ఇలాంటి ఓ ల్యాబ్ ఏర్పాటుచేశారు. మరో నెల రోజుల్లో ఈ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఈ ల్యాబ్ లో 50 రకాల అత్యాధునిక పరికరాలు ఉంటాయి... వీటిద్వారా తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదమే కాదు ఇతర అహార పదార్దాలు, నీటి నాణ్యతను చెక్ చేస్తారు. 200 రకాల పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, సూక్ష్మజీవులు అహార పదార్థాల్లో ఉంటే వెంటనే గుర్తిస్తాయి. ఈ ల్యాబ్ ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన అహారం అందించవచ్చు... ఆలయ పవిత్రతను కాపాడవచ్చు.

