అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం నూతన బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజులపాటు సెలవు పెట్టారు. ఇవాళ్టి నుండే ఆయన  సెలవుపై వెళ్లనుండగా తన బాధ్యతలన్నింటిని ఉదయమే మరో అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. ఎల్వీ నిర్ణయం ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం స్థానంలో  నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ  ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకొంది.

నీరబ్ కుమార్ ప్రసాద్‌ మంగళవారం నాడు ఉదయం ఏపీ ఇంచార్జీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. నీరబ్ కుమార్ కు ఏపీ సీఎస్‌గా బాధ్యతలను అప్పగించిన తర్వాత మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సెలవుపై వెళ్లాడు.

Also Read:ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: జగన్‌కు భవిష్యత్తు ముప్పు?

సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్‌ను మార్చివేయడంపై సీఎస్ గా ఉన్న సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ విషయమై తన అసంతృప్తిని షోకాజ్ నోటీసుల రూపంలో వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం  ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు ఇవ్వడంతో సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్లలోని హెచ్ఆర్‌డి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.

బాపట్ల హెచ్ఆర్‌డి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించకుండానే ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం నాడు సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీ వరకు ఎల్వీ సుబ్రమణ్యం సెలవు పెట్టారు.

పీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో  ఈసీ ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ అనిల్ పునేఠాను బదిలీ చేసి ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమిస్తూ ఆ సమయంలో ఈసీ ఆదేశాలను జారీ చేసింది.

ఈ ఆదేశాల మేరకు ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా నియమితులయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ  ఎల్వీసుబ్రమణ్యాన్ని కొనసాగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

ఇటీవల కాలంలో ఎల్వీ సుబ్రమణ్యానికి, సీఎం జగన్ కు మధ్య  ప్రవీణ్ ప్రకాష్ కారణంగా అగాధం పెరిగినట్టు ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొంది.

Also Read:ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు: రిలీవ్ అయిన ఎల్వీ

1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం 2020 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఎల్వీ సుబ్రమణ్యానికి మరో 5 మాసాల 26 రోజుల  సర్వీస్ మాత్రమే ఉంది. సీఎస్‌గా రిటైర్ అవుతారని భావించినప్పటికీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ విషయంలో  సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీసుకొన్న నిర్ణయంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.